Harish Rao: మహిళా దినోత్సవ సభలో రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలే: హరీశ్ రావు

- పరేడ్ గ్రౌండ్ సాక్షిగా రేవంత్ అబద్ధాలు చెప్పారన్న హరీశ్ రావు
- మహిళా సంఘాలకు రూ.21 వేల కోట్లు ఇచ్చి ఉంటే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్
- సీఎం, డిప్యూటీ సీఎం గోబెల్స్ ప్రచారంలో ఆరితేరిపోయారని విమర్శలు
మహిళా దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ అగ్రనేత హరీశ్ రావు ధ్వజమెత్తారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్పారని... అబద్ధానికి ప్యాంట్, షర్టు వేస్తే రేవంత్ రెడ్డిలా ఉంటుందని విమర్శించారు. మహిళా సంఘాలకు రూ.21 వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చామన్నారని... ఆ రుణాలు ఎలా ఇచ్చారో చెప్పాలని నిలదీశారు. ఒకవేళ రూ.21 వేల కోట్ల రుణాలు నిజంగానే ఇచ్చి ఉంటే ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రికి తోడు డిప్యూటీ సీఎం (మల్లు భట్టి విక్రమార్క) కూడా గోబెల్స్ ప్రచారంలో ఆరితేరారని విమర్శించారు. కేసీఆర్ ఇచ్చిందే ఇస్తూ... రూ.21 వేల వడ్డీ లేని రుణం అని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలను కాంగ్రెస్ సర్కారు మరింత మోసం చేస్తోందని, ఇచ్చే రూ.5 లక్షల వడ్డీ లేని రుణం కూడా ఇప్పటివరకు విడుదల చేయలేదని ఆరోపించారు.
ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది గుండు సున్నా అని, కాంగ్రెస్ ప్రచారం అంతా బోగస్, డొల్ల అని హరీశ్ రావు విమర్శించారు. నిన్న మీ అబద్ధాలు వినలేక సభ నుంచి మహిళలు వెళ్లిపోయారని వెల్లడించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి అబద్ధాలు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు.