Watermelon: పుచ్చకాయల్లోనూ కల్తీ.. ఆదమరిస్తే అంతేనంటున్న ఆరోగ్య నిపుణులు

Is your watermelon safe to eat

  • కృత్రిమ రసాయనాలతో ఎర్రగా కనిపించేలా చేస్తున్న వ్యాపారులు
  • కాయ త్వరగా పండేందుకు కార్బైడ్ ఇంజెక్షన్లు చేస్తున్న వైనం
  • శరీరంలోకి చేరితే తీవ్రమైన హాని కలిగిస్తుందని వైద్యుల హెచ్చరిక

వేసవిలో శరీరానికి చల్లదనాన్ని అందించే అద్భుతమైన ఫలం పుచ్చకాయ.. పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా ఆరగించే ఈ పండులోనూ కల్తీ జరుగుతోందని, కృత్రిమ రసాయనాలతో ఎర్రగా కనిపించేలా చేస్తున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉండడంతో పుచ్చకాయ త్వరగా పండాలని కార్బైడ్ ఇంజెక్షన్లు చేస్తున్నారని చెప్పారు. ఇలా కల్తీ జరిగిన పుచ్చకాయలను తింటే ఆరోగ్యం సంగతి అటుంచి ఆసుపత్రి పాలయ్యే ప్రమాదం ఉందంటున్నారు.

పుచ్చకాయలు లోపల ఎర్రగా కనిపించేందుకు కొంతమంది వ్యాపారులు ఎరిథ్రోసిన్ అనే రసాయనాన్ని ఇంజెక్ట్ చేస్తున్నారట. దీనివల్ల పుచ్చకాయ లోపలి భాగం ఎర్రగా కనిపిస్తూ నోరూరిస్తుంది. ఇలా కల్తీ జరిగిన పుచ్చకాయ తినడం వల్ల శరీరంలోకి ఎరిథ్రోసిన్ చేరి   కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, ఎరిథ్రోసిన్ క్యాన్సర్ కారకమని, ఎక్కువ మొత్తంలో శరీరంలోకి చేరే ఎరిథ్రోసిన్ వల్ల క్యాన్సర్ ముప్పు కూడా పొంచి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. 

కల్తీని గుర్తించడం ఎలాగంటే..
ఎరిథ్రోసిన్‌ను ఇంజెక్ట్ చేసి పండించిన పుచ్చకాయను గుర్తించడానికి సింపుల్ టెస్ట్ ను నిపుణులు సూచిస్తున్నారు. పుచ్చకాయ కొనడానికి ముందు ఓ ముక్క కోసి ఇమ్మని, టిష్యూ పేపర్ తో ఆ ముక్కను అక్కడక్కడా రుద్దాలని చెప్పారు. పుచ్చకాయ ముక్కపై రుద్దిన టిష్యూ ఎరుపు లేదా గులాబీ రంగులోకి మారిందంటే ఆ పుచ్చకాయను కృత్రిమ రసాయనాలతో పండించిందని అర్థం చేసుకోవాలి. అలాగే, పుచ్చకాయలో అక్కడక్కడ కొద్దిగా తెలుపు, పసుపు రంగులు కనిపిస్తుంటే అది కల్తీది కావొచ్చని నిపుణులు చెప్పారు. పుచ్చకాయను తినేముందు ఉప్పు నీటిలో బాగా కడగాలని సూచించారు.

Watermelon
Chemicals
Carbide Injections
Health
Fruits
  • Loading...

More Telugu News