Indian Railways: రైలు దిగుతూ పట్టాలపై పడిపోతున్న మహిళను కాపాడిన రైల్వే పోలీస్.. వీడియో ఇదిగో!

- ముంబైలోని బోరివలి రైల్వే స్టేషన్ లో ఘటన
- కదులుతున్న రైలులో నుంచి దిగిన మహిళ
- రైల్వే పోలీస్ సమయస్ఫూర్తితో తప్పిన ప్రాణాపాయం
ముంబైలోని బోరివలి రైల్వే స్టేషన్ లో ఓ మహిళా ప్రయాణికురాలు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది. కదులుతున్న రైలు నుంచి దిగే ప్రయత్నంలో సదరు మహిళ పట్టాలపై పడబోయింది. అదే సమయంలో అటుగా వెళుతున్న రైల్వే పోలీస్ ఒకరు సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. కిందపడబోతున్న మహిళను రైల్వే పోలీసు వేగంగా వెనక్కి లాగడంతో ఆమె సురక్షితంగా బయటపడింది. స్టేషన్ లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయిన ఫుటేజీని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. రైలు కదులుతుండగా ఎక్కడం కానీ, దిగడం కానీ చేయొద్దంటూ ప్రయాణికులకు రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సదరు రైల్వే పోలీస్ అధికారిని ప్రశంసిస్తూ, ఆయనకు తగిన రివార్డు ఇవ్వాలని, ఆయన అప్రమత్త వల్లే మహిళ ప్రాణాలు దక్కాయని కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి ప్రమాదాలను నివారించాలంటే మెట్రోల తరహాలో రైళ్లకు ఆటోమేటిక్ డోర్లను ఏర్పాటు చేయాలని పలువురు నెటిజన్లు రైల్వే శాఖకు సూచించారు.