Warangal Urban District: ఎస్సారెస్పీ కాల్వలో పడిన కారు.. మృతదేహాల వెలికితీత

- కుటుంబంతో కలిసి కారులో స్వగ్రామానికి బయలుదేరిన ప్రవీణ్
- మధ్యలో ఛాతి నొప్పి రావడంతో చికిత్స కోసం హన్మకొండకు యూటర్న్
- యూటర్న్ తీసుకునే సమయంలో అదుపుతప్పి ఎస్సారెస్పీ కాలువలో పడిన కారు
- కృష్ణవేణిని కాపాడిన స్థానికులు
తెలంగాణలోని వరంగల్ జిల్లా ఎస్సారెస్పీ కాలువలో కారు పడిన ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటనలో భార్య మాత్రమే ప్రాణాలతో బయటపడింది. వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజపల్లికి చెందిన ప్రవీణ్ తన భార్య, కుమారుడు, కుమార్తెతో కలిసి కారులో హన్మకొండ నుండి వారు స్వగ్రామానికి బయలుదేరారు. సంగెం మండలం తీగరాజువల్లి వద్దకు చేరుకున్నప్పుడు ప్రవీణ్‌కు ఛాతిలో నొప్పి వచ్చింది.
దీంతో, ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవడానికి వారు వరంగల్ తిరిగి వెళ్తుండగా, యూటర్న్ తీసుకునే సమయంలో ప్రమాదవశాత్తు కారు ఎస్సారెస్పీ కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో రెండేళ్ల కుమారుడు సాయివర్ధన్ అక్కడికక్కడే మృతి చెందాడు. కాలువలో కొట్టుకుపోతున్న కృష్ణవేణిని స్థానికులు రక్షించారు. ప్రవీణ్, నాలుగేళ్ల కుమార్తె చైత్రసాయి గల్లంతయ్యారు. వారి కోసం గాలిస్తుండగా, ప్రమాదం జరిగిన ప్రాంతానికి 200 మీటర్ల దూరంలో వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. అనంతరం కారును బయటకు లాగి మృతదేహాలను వెలికితీశారు.
కుమారుడి మృతదేహాన్ని ఎత్తుకొని కృష్ణవేణి విలపిస్తున్న తీరు అక్కడున్న వారిని కలచివేసింది. ప్రవీణ్ ఎల్ఐసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.