Borugadda Anil: నాకేమైనా జరిగితే వారిదే బాధ్యత.. కంటతడి పెట్టుకుంటూ వీడియో విడుదల చేస్తున్నా: బోరుగడ్డ అనిల్

- నాలుగు నెలలుగా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపణ
- చద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ నుండి తనకు ప్రాణహాని ఉందన్న అనిల్
- సర్జరీ అయిన నా తల్లిని చూసుకోవాల్సి ఉందన్న బోరుగడ్డ అనిల్
గత నాలుగు నెలలుగా కూటమి ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని బోరుగడ్డ అనిల్ ఒక వీడియోను విడుదల చేశారు. కంటతడి పెట్టుకుంటూ ఈ వీడియోను విడుదల చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ వల్ల తనకు ప్రాణహాని ఉందని, వాళ్ల నుండి తనను కాపాడాలని ఆయన వేడుకున్నారు. తనకు ఏమైనా జరిగితే అందుకు లోకేశ్, పవన్ కల్యాణ్‌దే బాధ్యత అని అన్నారు. తనకు దేవుడు, జగన్, వైసీపీయే దిక్కు అని పేర్కొన్నారు.
అనంతపురంలో తనకు బెయిల్ వచ్చే సమయంలో అడ్డుకునేందుకు పోలీసులు కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. కర్నూలులో పోలీసులు తనను చిత్రహింసలు పెట్టారని వాపోయారు. తన తల్లికి అపోలో ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరిగిందని, ఆమెను చూసుకోవాల్సింది తానేనని ఆయన పేర్కొన్నారు.
తన తల్లి ఆరోగ్యం విషయంలో కోర్టుకు తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించానని పోలీసులు చెబుతున్నారని, ఆ సమయంలో తాను జైల్లో ఉన్నానని, అలాంటి సమయంలో నకిలీ ధ్రువపత్రాలు ఎలా సృష్టిస్తానని ప్రశ్నించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, న్యాయస్థానాలంటే తనకు గౌరవం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం చెన్నైలో ఉండి తల్లిని చూసుకుంటున్నానని, తనకు జగన్, వైసీపీ తప్ప ఎవరూ లేరని వాపోయారు. తనకు బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితులు పగవాడికి కూడా రాకూడదని వీడియోలో ఆయన పేర్కొన్నారు.