Rohini: మహిళలపై నేరాల అణిచివేతకు ఒక హత్యకు శిక్ష పడకుండా రక్షణ కల్పించండి: ఎన్సీపీ మహిళా నాయకురాలు

Allow women to commit one murder without punishment
  • రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాసిన శరద్ పవార్ పార్టీ నాయకురాలు రోహిణి
  • మహిళలపై నేరాలు పెరుగుతున్నాయన్న ఎన్సీపీ మహిళా నాయకురాలు
  • దేశ రక్షణ కోసం తారా రాణి, అహల్యాదేవి హోల్కర్ కత్తి పట్టారని వ్యాఖ్య
మహిళలపై పెరుగుతున్న నేరాల అణచివేతకు, ఒకవేళ నేరం జరుగుతున్నప్పుడు మహిళలు చేసే హత్యకు ఎలాంటి శిక్ష పడకుండా రక్షణ కల్పించాలని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్) మహిళా విభాగం అధ్యక్షురాలు రోహిణి ఏక్‌నాథ్‌రావు ఖడ్సే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. ఈ మేరకు శనివారం ఆమె లేఖ రాశారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన రోహిణి, మహాత్మా గాంధీ, బుద్ధుడు నడయాడిన నేలలో, శాంతికి, అహింసకు నిలయమైన నేలలో మహిళలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై హింసా ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

రెండు రోజుల క్రితం ముంబైలో పన్నెండేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందని, ఆమె పరిస్థితి గురించి ఆలోచించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. మానవ మృగాల్లోని ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనా విధానాన్ని అంతమొందించేందుకు తమకు అవకాశమివ్వాలని ఆమె కోరారు. దేశ రక్షణ కోసం మహారాణి తారా రాణి, అహల్యాదేవి హోల్కర్ వంటి వారు కత్తిని బయటకు తీశారని గుర్తు చేశారు.

ఇటీవల విడుదలైన సర్వే ప్రకారం దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని తేలినట్లు చెప్పారు. మహిళల కిడ్నాప్‌లు, అదృశ్యం, గృహ హింస వంటి నేరాలతో ఆసియాలోనే మన దేశం అసురక్షితంగా ఉందని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాము చేసే ఒక్క తప్పును క్షమించాలని మహిళల తరఫున కోరుతున్నట్లు ఆమె విజ్ఞప్తి చేశారు.
Rohini
BJP
President Of India

More Telugu News