Chandrababu: మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన పథకాలు, కార్యక్రమాల జాబితా ఇదే

List of AP government launches on world womens day
  • మహిళా సంక్షేమం, సాధికారత, భద్రత కోసం వివిధ సంస్థలతో ఎంవోయులు
  • సెర్ప్, మెప్మా, ఎంఎస్ఎంఈ విభాగానికి సంబంధించి బ్రోచర్ విడుదల
  • 'శక్తి టీమ్స్'ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు 
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమం, సాధికారత, భద్రత కోసం వివిధ సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకోవడంతో పాటు పలు పథకాలు, కార్యక్రమాలను ప్రారంభించింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి:

1. సెర్ప్, మెప్మా, ఎంఎస్ఎంఈ విభాగాల ద్వారా అవకాశాలు, స్వయం ఉపాధి, ఆర్థిక వెసులుబాటు కల్పించి లక్ష మంది మహిళా ఎంటర్‌ప్రెన్యూర్‌లను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. దీనికి సంబంధించి బ్రోచర్‌ను విడుదల చేసింది. మెప్మాలో 30 వేల మంది, రాపిడోలో 10 వేల మంది మహిళలకు ఉపాధి కల్పించనున్నారు. 4 వేల మందికి స్వయం ఉపాధి పథకాల ద్వారా, 4 వేల మందికి కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా, 4 వేల మందికి పర్యాటక అనుబంధ రంగాల్లో, 4 వేల మంది తృప్తి హోటల్స్ స్థాపన ద్వారా, 2 వేల మందికి స్మార్ట్ స్ట్రీట్స్ వెండింగ్ జోన్‌లో, మరో 2 వేల మందికి టిడ్కో జీవనాధారం కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. వ్యవసాయాధారిత, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, సర్వీస్ సెక్టార్, వ్యాపారాల్లో మహిళలకు జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఎంఎస్ఎంఈ రంగంలో 10 వేల మందికి జీవనోపాధి కల్పించేందుకు 2025-26 సంవత్సరానికి యాక్షన్ ప్లాన్‌ను విడుదల చేసింది.

2. మహిళలు, పిల్లల భద్రతే లక్ష్యంగా ముఖ్యమంత్రి 'శక్తి టీమ్స్‌'ను ప్రారంభించారు. ఈ శక్తి టీమ్స్ బహిరంగ ప్రదేశాల్లో మహిళలు, పిల్లలపై వేధింపులు అరికట్టడం, నేరాలను నిరోధించడం, తక్షణ సాయం అందించి వారికి రక్షణ కవచంగా నిలిచేలా పని చేస్తాయి.

3. చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించేందుకు చేనేత రథాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ప్రతి జిల్లాకు ఒక్కో వ్యానును 60 లక్షల ఖరీదుతో అందిస్తుంది. దీని ద్వారా చేనేత ఉత్పత్తుల విక్రయం మరింత సులభం అవుతుంది. ఈ సందర్భంగా ఒక్కో చేనేత మహిళకు 36 చీరలు నేసేందుకు సరిపడా నూలును ఉచితంగా పంపిణీ చేశారు.

4. 1.50 లక్షల మంది మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు పంపిణీ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణతో పాటు మిషన్లు పంపిణీ చేయనున్నారు.

5. "మహిళలకు మహిళల కోసం మహిళల చేత" కార్యక్రమంలో భాగంగా ఎన్డీసీ వేదికగా వావ్ జీని యాప్‌ని ఉపయోగించుకుని లక్షకు పైగా డ్వాక్రా ఉత్పత్తులు రికార్డు స్థాయిలో రూ.5.13 కోట్లకు విక్రయించారు. ఈ సందర్భంగా సాధించిన గిన్నిస్ రికార్డును ముఖ్యమంత్రికి అందజేశారు.

6. 7,471 మంది పట్టణ పేద మహిళలకు 645.52 కోట్ల బ్యాంకు రుణాలను పంపిణీ చేశారు. ఒక్కో మహిళకు సుమారు రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు రుణం అందుతుంది.

7. 1.43 లక్షల మంది గ్రామీణ మహిళలకు బ్యాంక్ లింకేజ్ ద్వారా ఉత్పాదక రుణాల పథకం కింద రూ.1,826.43 కోట్లు, స్త్రీ నిధి సంస్థ కింద రూ.1,000 కోట్లు మంజూరుకు సంబంధించి లబ్ధిదారులకు చెక్కులను అందించారు. 

8. డ్వాక్రా సంఘాల ఉత్పత్తుల విక్రయాలకు ఫ్లిప్‌కార్ట్‌తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. వ్యవసాయ, వ్యవసాయేతర ఉత్పత్తులపై డ్వాక్రా మహిళలకు వ్యాపార శిక్షణ అందించడంపై క్యాటలిస్టు మేనేజ్‌మెంట్ సర్వీసెస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

9. ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా వ్యవసాయాధారిత ఉత్పత్తులకు వ్యాల్యూ చైన్ అందించనుంది. అదే విధంగా డ్వాక్రా సంఘాలకు సంబంధించిన సేంద్రీయ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు సెంటర్ ఫర్ కలెక్టివ్ డెవలప్‌మెంట్‌తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.

10. చిన్న తరహా హోటల్ వ్యాపారంలో డ్వాక్రా మహిళలకు అవగాహన కల్పించడానికి గాటోస్ కేఫ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పనకు ఉపయోగపడుతుంది. 

11. సర్వీస్ ప్రొవైడర్ల జీవనోపాధి అవకాశాలను పెంపొందించడానికి హోమ్ ట్రయాంగిల్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 18,515 సర్వీస్ ప్రొవైడర్లకు ప్రయోజనం చేకూరుతుంది. నెలకు రూ.15,000 నుంచి రూ.35,000 వరకు నికర ఆదాయం వస్తుంది. సర్వీస్ ప్రొవైడర్లలో ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, కార్పెంటర్లు, బ్యూటీషియన్లు, గృహోపకరణ మరమ్మతులు చేసే వారికి శిక్షణ కల్పిస్తారు. 

12. రాపిడోతో కుదుర్చుకున్న ఒప్పందంలో ఆన్‌బోర్డింగ్ ఛార్జీలు, నెలవారీ చార్జీలను మూడు నెలల పాటు మాఫీ చేస్తుంది. దీని ద్వారా రాపిడీలో ఉన్న మహిళలకు సుమారు రూ.30 వేల వరకు లబ్ధి చేకూరుతుంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 1,000 ఎలక్ట్రిక్ వాహనాలను మహిళా రైడర్లకు అందించింది. ఇందులో 760 ఈ-బైక్‌లు, 240 ఈ-ఆటోలు ఉన్నాయి.

13. నేచర్ అరకు కాఫీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. గ్లోబల్ మార్కెట్‌లో అరకు కాఫీ ఉత్పత్తులు పెంచేందుకు, గ్రామీణ ప్రాంతాలకు అరకు కాఫీ విస్తరించేందుకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేస్తారు. తొలి విడతలో 100 అరకు కాఫీ అవుట్‌లెట్లు ఏర్పాటు చేస్తారు. తద్వారా డ్వాక్రా మహిళలకు ఉపాధి లభిస్తుంది.

14. రాష్ట్రంలోని 55,607 మంది అంగన్వాడీ వర్కర్లకు, 48,909 మంది హెల్పర్లకు మేలు చేకూర్చేలా మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి గ్రాట్యూటీ అమలును ప్రకటించారు. దీని ద్వారా ఒక్కో అండన్వాడీ వర్కర్ రూ.1.79 లక్షల నుంచి రూ.2.32 లక్షల వరకు, హెల్పర్లకు రూ.1.09 లక్షల నుంచి రూ.1.41 లక్షల వరకు లబ్ధి కలుగుతుంది. దీని అమలుకు ప్రభుత్వంపై ఏటా రూ.17.73 కోట్ల భారం పడుతుంది. 

15. ఆశా వర్కర్లు ఎప్పటి నుంచో కోరుతున్న గ్రాట్యూటీని సీఎం ఈ సందర్భంగా అమలు చేశారు. 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు రిటైర్డ్ అయిన, మరణించిన ఆశా వర్కర్లకు గ్రాట్యూటీ అమలవుతుంది. గతేడాది జూన్ నుంచి అమలు చేసే గ్రాట్యూటీకి గాను రూ.1.90 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. 

16. పీఎం - విశ్వకర్మ పథకం ద్వారా 1,000 మంది మహిళలకు ప్రభుత్వం రూ. 1 లక్ష వరకు రుణం మంజూరు చేసింది.
Chandrababu
Andhra Pradesh
Womens Day

More Telugu News