Rajendra Prasad: ఇదంతా వారి చలవే: నటుడు రాజేంద్ర ప్రసాద్!

- ఎన్టీఆర్ గారి ఇంట్లో పుట్టి పెరిగాను
- పెద్దాయనతో ఎంతో సాన్నిహిత్యం ఉండేది
- కృష్ణగారు నన్ను మెచ్చుకున్నారు
- ఎన్టీఆర్ గారు .. కృష్ణగారు ఫీల్డ్ లో ఉండగా రావడం నా అదృష్టం
రాజేంద్రప్రసాద్ .. కొన్ని దశాబ్దాల పాటు తెలుగు తెరపై హాస్యాన్ని పరిగెత్తించిన కథానాయకుడు. అప్పుడు హీరోగా ఆయన ఎంత బిజీగా ఉండేవారో .. ఇప్పుడు కేరక్టర్ ఆర్టిస్టుగా అంతే బిజీగా ఉన్నారు. అలాంటి రాజేంద్రప్రసాద్ తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన కెరియర్ గురించిన అనేక విషయాలను ఆయన ప్రస్తావించారు.
"నేను నిమ్మకూరులో రామారావుగారి ఇంట్లో పుట్టాను. నన్ను ముందుగా చేతుల్లోకి తీసుకున్నది రామారావుగారి తల్లిగారే. అక్కడే పెరగడం వలన రామారావుగారితో మంచి సాన్నిహిత్యం ఉండేది. పెద్ద పెద్ద దర్శక నిర్మాతలు ఆయనను కలిసి వెళుతూ ఉండేవారు. అయితే అప్పటికి నేను చాలా సన్నగా .. పీలగా ఉండటం వలన నన్ను ఆర్టిస్టును చేయాలనే ఆలోచన ఎవరూ చేయలేదు" అని అన్నారు.
"అనుకోకుండా నేను 'రామ రాజ్యంలో భీమరాజు' చేశాను. 'ఈ కుర్రాడు ఎవరో చాలా బాగా చేస్తున్నాడయ్యా' అంటూ అక్కడే అందరి ముందు కృష్ణగారు మెచ్చుకున్నారు. అప్పటికప్పుడే తాను చేస్తున్న మిగతా సినిమాలలో నాకు అవకాశం ఇప్పించారు. ఆ సినిమా విడుదల కాగానే నన్ను ఇంటికి పిలిపించి అభినందించారు. అప్పటికి నా చేతిలో 14 సినిమాలు ఉన్నాయి. ఎన్టీఆర్ గారు .. కృష్ణగారు ఇండస్ట్రీలో ఉండగా నేను రావడం, నా అదృష్టంగానే భావిస్తుంటాను .. ఇదంతా వారి చలవే" అని చెప్పారు.