PM Narendra Modi: నా సోషల్ మీడియా ఖాతాల నిర్వహణను మహిళలకు అప్పగిస్తా: ప్రధాని మోదీ ప్రకటన

- అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా విజేతలకు మరోసారి మోదీ గుడ్ న్యూస్
- 2020లో ఏడుగురు మహిళలకు తన సోషల్ మీడియా ఖాతాల అప్పగింత
- సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్న నేతల్లో ఒకరుగా ఉన్న ప్రధాని మోదీ
మహిళా విజేతలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభవార్త తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన సోషల్ మీడియా ఖాతాల నిర్వహణను మహిళలకే అప్పగిస్తానని ఆయన మరోసారి ప్రకటించారు. నిన్న సూరత్‌లో ఆహార భద్రత ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోదీ ఈ విషయాన్ని వెల్లడించారు.
వివిధ రంగాల్లోని మహిళా విజేతలకు తన వివిధ సోషల్ మీడియా ఖాతాలను ప్రధాని మోదీ అప్పగించడం కొత్తేమీ కాదు. విజేతలైన మహిళలు తమ కృషి, అనుభవం గురించి తన సోషల్ మీడియా ఖాతాల్లో వివరించేందుకు 2020 మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏడుగురు ప్రముఖ మహిళలకు వాటి నిర్వహణ బాధ్యతలను మోదీ అప్పగించారు. వారిలో ఏపీకి చెందిన కల్పన రమేశ్ తో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన స్నేహ మోహన్ దాస్, డాక్టర్ మాళవిక, అరిఫా జాన్, విజయ పవార్, కళావతిదేవి, వీణాదేవిలు ఉన్నారు.
ఎక్స్ (ట్విట్టర్), యూట్యూబ్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్న ప్రపంచ నేతల్లో మోదీ ఒకరు. వివిధ రంగాల్లో విజేతలైన మహిళలు తమ సామాజిక సేవ ద్వారా లక్షలాది మందికి ప్రేరణ కలిగించాలన్న ఉద్దేశంతో ప్రధాని మోదీ నారీ శక్తికి తన సోషల్ మీడియా ఖాతాల నిర్వహణను అప్పగిస్తున్నారు.