SLBC Tunnel: ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలు... రంగంలోకి కేరళ డాగ్ స్క్వాడ్

- ఫిబ్రవరి 22న ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం
- పైకప్పు కూలి 8 మంది చిక్కుకుపోయిన వైనం
- 14 రోజులుగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ 14వ కిలోమీటరు వద్ద ప్రమాదం జరిగి రెండు వారాలు గడుస్తున్నప్పటికీ, గల్లంతైన వారి ఆచూకీ ఇప్పటిదాకా తెలియరాలేదు. 14 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ ప్రమాదంలో 8 మంది చిక్కుకుపోగా, వారు బతికుంటారన్న ఆశలు ఎప్పుడో ఆవిరయ్యాయి. వారి మృతదేహాలను వెలికితీసేందుకే వందలమందితో కూడిన సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
తాజాగా, కడావర్ డాగ్ స్క్వాడ్ ను కూడా రంగంలోకి దింపారు. మృతదేహాలను గుర్తించడంలో ఈ శునకాలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. 15 అడుగుల లోతున ఉన్న వాటిని కూడా ఈ జాగిలాలు పసిగట్టగలవు. వీటితో పాటు 110 మంది సిబ్బంది కూడా టన్నెల్ లోకి ప్రవేశించారు.
కాగా, ప్రత్యేక శిక్షణ పొందిన ఈ శునకాలు కేరళ పోలీస్ విభాగానికి చెందినవి. వీటిని ప్రత్యేకంగా హెలికాప్టర్ లో తీసుకువచ్చారు.
ఈ ప్రయత్నంలోనైనా గల్లంతైన వారి ఆచూకీ లభిస్తుందేమోనని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.