Delimitation: డీలిమిటేషన్ పై రాజుకుంటున్న నిప్పు... ఏడు రాష్ట్రాల సీఎంలకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ లేఖ

- డీలిమిటేషన్ అంశంపై దక్షిణాది రాష్ట్రాల్లో అసంతృప్తి
- ఇప్పటికే బాహాటంగా వ్యతిరేకిస్తున్న స్టాలిన్
- డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా తమతో కలిసి పోరాడాలని ఆయా రాష్ట్రాలకు పిలుపు
- ఈ నెల 22న చెన్నైలో జాయింట్ యాక్షన్ సమావేశం
- వైసీపీ, బీఆర్ఎస్ లకు కూడా ఆహ్వానం
లోక్ సభ స్థానాల పునర్ విభజన (డీలిమిటేషన్) అంశం దక్షిణాది రాష్ట్రాల్లో కాక పుట్టిస్తోంది. డీలిమిటేషన్ జరిగితే దక్షిణ భారతదేశంలో లోక్ సభ సీట్ల సంఖ్య తగ్గుతుందని.... జనాభా ఎక్కువగా ఉండే ఉత్తరాది రాష్ట్రాల్లో లోక్ సభ స్థానాల సంఖ్య పెరుగుతుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ డీలిమిటేషన్ కు ససేమిరా అంటున్నారు. తమిళనాడులో కొత్త జంటలు వీలైనంత త్వరగా పిల్లలు కనాలని ఆయన పిలుపునిచ్చారు. తద్వారా తమిళనాడు జనాభా పెరిగితే, డీలిమిటేషన్ లో లబ్ధి కలుగుతుందన్నది స్టాలిన్ ఆలోచన. ఈ క్రమంలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది.
డీలిమిటేషన్ అంశంపై ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సీఎం స్టాలిన్ లేఖ రాశారు. పార్లమెంటు నియోజకవర్గాల పునర్ విభజనకు వ్యతిరేకంగా తమతో కలిసి పోరాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, పంజాబ్ రాష్ట్రాలకు లేఖ రాశారు.
మార్చి 22న చెన్నైలో జరిగే సంయుక్త కార్యాచరణ సమావేశానికి ఆయా రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించారు. ఈ జాయింట్ యాక్షన్ సమావేశానికి రావాలంటూ ఏడు రాష్ట్రాల విపక్ష నేతలకు కూడా స్టాలిన్ ఆహ్వానం పలికారు. స్టాలిన్ నుంచి ఆహ్వానం అందుకున్న పార్టీల్లో వైసీపీ, బీఆర్ఎస్ కూడా ఉన్నాయి.
కేవలం రాజకీయ సంస్థలుగా కాకుండా... ప్రజల భవిష్యత్ రక్షకులుగా ఐక్యంగా నిలబడదామని పిలుపునిచ్చారు. డీలిమిటేషన్ అనేది సమాఖ్య వాదంపై కేంద్రం చేస్తున్న దాడి అని స్టాలిన్ స్పష్టం చేశారు. గతంలో ఎంతో కష్టపడి జనాభా నియంత్రణ చేపట్టిన రాష్ట్రాలకు పార్లమెంటులో హక్కులు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి జరుగుతున్న ఈ అన్యాయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దని స్పష్టం చేశారు.