Nara Lokesh: విశ్రాంతి తీసుకోండి... లేకపోతే సభ నుంచి సస్పెండ్ చేయిస్తా: మంత్రి నిమ్మలతో లోకేశ్ సరదా సంభాషణ

- అనారోగ్యంతో బాధపడుతున్న నిమ్మల
- అయినప్పటికీ విధి నిర్వహణలో తలమునకలు
- సున్నితంగా మందలించిన నారా లోకేశ్
- ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని సూచన
రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అనారోగ్యంతో బాధపడుతూ కూడా విధులు నిర్వర్తిస్తుండడం పట్ల సహచర మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఇవాళ అసెంబ్లీ లాబీలో నిమ్మల, లోకేశ్ సరదాగా మాట్లాడుకున్నారు.
మంత్రి నిమ్మల చేతికి ఇంజెక్షన్ కేనలా ఉండడాన్ని గమనించిన లోకేశ్... నిన్న ఆ చేతికి ఉంది... ఇవాళ ఈ చేతికి వచ్చింది అంటూ ఆరా తీశారు. నిన్న చేతికి కేనలా ఉండడం చూసే, బయటికొచ్చి ఆ విషయం అడిగానని తెలిపారు. అందుకు నిమ్మల బదులిస్తూ... రాత్రి హైదరాబాద్ కూడా వెళ్లొచ్చానని వెల్లడించారు.
మీరు విశ్రాంతి తీసుకోవాలి... లేకపోతే సభ నుంచి సస్పెండ్ చేయమని చెప్పమంటారా... అంటూ లోకేశ్ చమత్కరించారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని సున్నితంగా మందలించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.