Nara Lokesh: కుటుంబాలు వలస వెళ్లడం చూశాకే ఆ హామీ ఇచ్చాం: అసెంబ్లీలో మంత్రి నారా లోకేశ్

Nara Lokesh says will develop seasonal hostels

  • సాగు, తాగునీటికి సంబంధించి పవన్ కల్యాణ్‌తో రెండుసార్లు చర్చించానన్న మంత్రి
  • సీజనల్ హాస్టళ్ల పనితీరును మెరుగుపరుస్తామన్న మంత్రి లోకేశ్
  • వలసల నివారణకు చరలు తీసుకుంటామని హామీ

ఆలూరు, ఆదోనిలో యువగళం పాదయాత్ర కొనసాగుతున్న సమయంలో కుటుంబాలు మూకుమ్మడిగా వలసలు వెళ్లడం చూశానని, అవన్నీ చూశాకే ఇరిగేషన్, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసి సాగు, తాగునీరు ఇస్తామని హామీ ఇచ్చానని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ఒకే వాహనంపై 200 మంది వెళ్లడం కూడా గమనించానని ఆయన తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం సాగు, తాగునీరు ఇచ్చే బాధ్యత ఎన్డీయే ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు.

అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, నంద్యాల తర్వాత కర్నూలులో పాదయాత్ర చేశానని, ఈ రెండు ప్రాంతాల మధ్య ఎంతో వ్యత్యాసం కనిపించిందని అన్నారు. కర్నూలు జిల్లాలో మారుమూల ప్రాంతాలకు కూడా సాగు, తాగునీరు అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ విషయమై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో రెండుసార్లు చర్చించినట్లు అసెంబ్లీ వేదికగా చెప్పారు. స్థూల నమోదు నిష్పత్తి, అక్షరాస్యతలో కర్నూలు వెనుకబడి ఉందనేది ఎవరూ కాదనలేని వాస్తవమని ఆయన అన్నారు. అందుకే రాబోయే డీఎస్సీలో కర్నూలుకు ఎక్కువమంది ఉపాధ్యాయులు రాబోతున్నారని తెలిపారు. 

విద్యార్థులకు అపార్ ఐడీని కేంద్రం తప్పనిసరి చేస్తోందన్నారు. కేజీ నుండి పీజీ వరకు ఒక కంట్రోల్ రూమ్ పెట్టి విద్యార్థులను ట్రాక్ చేస్తామని వెల్లడించారు. ఇందుకు అవసరమైన ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను తయారు చేస్తున్నామని తెలిపారు. ఒక్క డ్రాపవుట్ కూడా ఉండకూడదనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.

సీజనల్ హాస్టల్స్‌కు సంబంధించి కేవలం భోజనం పెట్టడానికి మాత్రమే అవకాశం ఉందన్నారు. కరవు ప్రాంతాల్లోని ప్రజలు వేరేచోటకు వలసలు వెళ్లిన సమయంలో అక్కడ అడ్మిషన్లు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. హాస్టళ్ల పనితీరు, విద్యార్థుల ట్రాకింగ్ ఉంటేనే డ్రాపవుట్స్ తగ్గుతాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో 2024-25లో 121 సీజనల్ హాస్టళ్లు ఉండగా, వాటిలో 6,040 మంది విద్యార్థులకు భోజన వసతి కల్పించినట్లు చెప్పారు. ఇందుకోసం రూ.6.04 కోట్లు ఖర్చు పెడుతున్నామని ఆయన అన్నారు. సీజనల్ హాస్టళ్ల నిర్వహణ ఇప్పటివరకు ప్రణాళికాబద్ధంగా లేదని అన్నారు.

పిల్లలకు మెరుగైన విద్య అందించాలన్నదే తమ లక్ష్యమని నారా లోకేశ్ అన్నారు. పిల్లల వలసల నివారణకు గత ప్రభుత్వం పని చేయలేదని విమర్శించారు. సీజనల్ హాస్టళ్ల పనితీరు మెరుగుదలకు అసెంబ్లీ అయ్యాక శాసనసభ్యులతో చర్చిస్తామని అన్నారు. హాస్టళ్ల పనితీరు మెరుగు, పాఠశాలల్లో చేరేవారి నిష్పత్తి, విద్యార్థులు-ఉపాధ్యాయుల నిష్పత్తి పెరుగుదలకు వచ్చే మూడేళ్లు కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. 

బీసీ, ఎస్సీ హాస్టళ్లను కన్వర్జెన్స్ చేసి సీజనల్ హాస్టళ్ల పనితీరు మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. రాబోయే మూడేళ్లలో హాస్టళ్ల పనితీరులో మార్పు తెస్తామన్నారు. సీజనల్ హాస్టళ్లకు సంబంధించి పలు పత్రికల్లో ఆర్టికల్స్ వచ్చాయని, ఏ మీడియాలో వచ్చినా సీరియస్‌గా తీసుకుంటున్నామని చెప్పారు. రాబోయే రెండు, మూడు నెలల్లో సీజనల్ హాస్టళ్ల పనితీరులో మార్పును మీరే గమనిస్తారని మంత్రి లోకేశ్ తెలిపారు.

Nara Lokesh
AP Assembly Session
Telugudesam
  • Loading...

More Telugu News