Holi: హోలీ ఏడాదికి ఒక్కసారే.. శుక్రవారం నమాజ్ ఏటా 52 సార్లు వస్తుందన్న పోలీస్ ఆఫీసర్

Holi Comes Once A Year Friday Namaz 52 Times Says UP Cop
  • రంగులు సరిపడవంటే ఆ ఒక్క రోజు ఇంట్లోనే ఉండాలని సూచన
  • యూపీలోని సంభాల్ లో వివాదాస్పదంగా మారిన పోలీస్ అధికారి వ్యాఖ్యలు
  • రంజాన్, హోలీ పండుగల సందర్భంగా సంభాల్ లో పీస్ కమిటీ మీటింగ్
హోలీ రంగులు తమకు సరిపడవని భావించే వారు ఆ ఒక్కరోజు ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉంటే సరిపోతుందని యూపీ పోలీస్ ఆఫీసర్ ఒకరు వ్యాఖ్యానించారు. హోలీ పండుగ ఏడాదికి ఒక్కసారి మాత్రమే వస్తుందని, శుక్రవారం నమాజ్ ఏటా 52 సార్లు వస్తుందని అన్నారు. రంజాన్, హోలీ పండుగల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లోని సంభాల్ పోలీస్ స్టేషన్ లో గురువారం పీస్ కమిటీ సమావేశమైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సభ్యుల మధ్య చర్చ జరిగింది. ఈ క్రమంలో రంజాన్ మాసంలో హోలి పండుగ రావడం, అదీ శుక్రవారం రావడంతో నమాజ్ కు వెళ్లే ముస్లింలకు ఇబ్బంది కలుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

దీనిపై సంభాల్ సర్కిల్ ఆఫీసర్ (సీఓ) అనూజ్ చౌదరి మాట్లాడుతూ.. పండుగలనేవి అందరూ కలిసిమెలిసి చేసుకోవాలని, పండుగకు నిజమైన అర్థం అదేనని చెప్పారు. రంగులు తమకు సరిపడవని భావించే వారు హోలీ రోజు ఇంటికే పరిమితం కావాలని సూచించారు. ఆ రోజు బయటకు వచ్చే వారు విశాల దృక్పథంతో ఆలోచించాలని చెప్పారు. శుక్రవారాలు ఏడాదికి 52 వస్తాయి కానీ హోలీ పండుగ ఏటా ఒక్కసారే వస్తుందని అన్నారు. రెండు వర్గాలు మతసామరస్యంతో మెలగాలని, ఒకరి పండుగలను మరొకరు గౌరవించుకోవాలని హితవు పలికారు. ముస్లింలు ఈద్ కోసం ఎంత ఆత్రుతగా ఎదురుచూస్తారో హిందువులు హోలీ పండుగ కోసం అంతే ఆత్రుతగా ఎదురుచూస్తారని వ్యాఖ్యానించారు.

హోలీని రంగులు చల్లుకుంటూ స్వీట్లు పంచుకుంటూ జరుపుకుంటే, ఈద్ పండుగను ప్రత్యేకమైన వంటకాలతో సెలబ్రేట్ చేసుకుంటారని, ఐకమత్యం, ఇతరులను గౌరవించాలనే రెండు పండుగలు చాటిచెబుతాయని అనూజ్ చౌదరి చెప్పారు. అయితే, సీఓ అనూజ్ చౌదరి వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమాజ్ వాదీ పార్టీ అధికార ప్రతినిధి శర్వేంద్ర బిక్రమ్ సింగ్ మాట్లాడుతూ.. పోలీసులు బీజేపీ ఏజెంట్లలాగా మాట్లాడవద్దని హితవు పలికారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ దృష్టిలో పడాలని కొంతమంది ఆఫీసర్లు అత్యుత్సాహంతో ఇలాంటి కామెంట్లు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ అధికారి ఎవరైనా, ఏ మతానికి చెందిన వారైనా సరే లౌకికత్వంతో మెలగాలని, అన్ని మతాల ప్రజలను సమానంగా చూడాలని చెప్పారు.
Holi
Ramjan
Friday Namaz
Uttar Pradesh
Sambhal
Peace Committee

More Telugu News