Kalpana: మా కుటుంబంపై తప్పుడు ప్రచారం సాగుతోంది.. అందుకే ఈ వివరణ!: వీడియో విడుదల చేసిన గాయని కల్పన

Kalpana says she have no differences with husband
  • తన భర్తపై తప్పుడు ప్రచారాన్ని ఆపివేయాలని విజ్ఞప్తి
  • వృత్తిపరమైన ఒత్తిడి కారణంగా నిద్రపట్టడం లేదన్న కల్పన
  • నిద్ర టాబ్లెట్లను అధిక మోతాదులో తీసుకోవడం వల్లే ఇలా జరిగిందని వెల్లడి
మీడియాలో తమ కుటుంబంపై తప్పుడు ప్రచారం సాగుతోందని, ఈ అంశంపై తాను వివరణ ఇవ్వాలనుకుంటున్నానని, తన భర్తతో తనకు ఎలాంటి విభేదాలు లేవని వివరిస్తూ గాయని కల్పన ఒక వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. కూతురితో గొడవ, భర్తతో విభేదాల వల్ల ఆమె ఆత్మహత్యాయత్నం చేసిందని ప్రచారం సాగుతోంది. అయితే అధిక మోతాదులో నిద్రమాత్రలను తీసుకోవడం వల్లే అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు కల్పన కుటుంబం వివరణ ఇచ్చింది.

అయినప్పటికీ తప్పుడు ప్రచారం జరుగుతోందంటూ కల్పన ఒక వీడియోను విడుదల చేశారు. తమ కుటుంబంపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై వివరణ ఇవ్వాలనుకుంటున్నానని, తన భర్తపై తప్పుడు ప్రచారాన్ని ఆపివేయాలని ఆమె అందులో కోరారు. ఒత్తిడి కారణంగానే నిద్రపట్టలేదని, అధిక మోతాదులో నిద్రమాత్రలు వేసుకున్నట్లు వెల్లడించారు.

తన కుటుంబం చాలా సంతోషంగా జీవిస్తోందని, తన భర్త సహకారం వల్లే ఎన్నో చేయగలుగుతున్నానని ఆమె తెలిపారు. తనకు వృత్తిపరమైన ఒత్తిడి కారణంగా నిద్ర సరిగ్గా పట్టడం లేదని తెలిపారు. అందుకోసం చికిత్స తీసుకుంటున్నానని, వైద్యులు సూచించిన ప్రిస్క్రిప్షన్‌లోని టాబ్లెట్లను అధిక మోతాదులో తీసుకున్నానని తెలిపారు. అందువల్లే స్పృహ తప్పి పడిపోయినట్లు చెప్పారు.

తన భర్త సరైన సమయంలో స్పందించారని, అలాగే తమ కాలనీ వాసులు, పోలీసుల సహకారంతో ఇప్పుడు కోలుకుంటున్నానని పేర్కొన్నారు. త్వరలో పాటలతో మళ్లీ అందరినీ అలరిస్తానని తెలిపారు. తన జీవితంలో తనకు తన భర్త అతిపెద్ద బహుమతి అని, ఆయన సహకారం వల్లే నచ్చిన రంగాల్లో రాణిస్తున్నానని తెలిపారు. కాబట్టి తప్పుడు ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. తన ఆరోగ్యం గురించి చాలామంది వాకబు చేస్తున్నారని, వారందరికీ ధన్యవాదాలు అని ఆమె వీడియోలో పేర్కొన్నారు.
Kalpana
Tollywood
Hyderabad

More Telugu News