Borugadda Anil: తప్పుడు మెడికల్ సర్టిఫికెట్‌తో హైకోర్టుకు బోరుగడ్డ టోకరా

YCP leader Borugadda Anil cheated AP High Court

  • రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్
  • తల్లి అనారోగ్యం పేరుతో ఒకసారి మధ్యంతర బెయిలు
  • మధ్యంతర బెయిలు పొడిగించాలంటూ మరోమారు పిటిషన్
  • గుంటూరులోని లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యుడు ఇచ్చినట్టుగా మెడికల్ సర్టిఫికెట్
  • మళ్లీ మధ్యంతర బెయిలు మంజూరు చేసిన హైకోర్టు
  • తామివ్వలేదన్న ఆసుపత్రి చీఫ్ కార్డియాలజిస్ట్
  • నకిలీ సర్టిఫికెట్‌తో కోర్టును మోసగించినందుకు చర్యలకు సిద్ధమవుతున్న పోలీసులు

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, వారి కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో అరెస్ట్ అయిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్‌కుమార్ హైకోర్టును తప్పుదోవ పట్టించిన విషయం వెలుగులోకి వచ్చింది. తన తల్లి పద్మావతి అనారోగ్యంతో బాధపడుతున్నారని పేర్కొంటూ తప్పుడు మెడికల్ సర్టిఫికెట్ సమర్పించి మధ్యంతర బెయిలు పొందిన విషయం తాజాగా బయటపడింది.

అనంతపురంలో నమోదైన కేసులో రాజమహేంద్రవరం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న బోరుగడ్డ.. తన తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆమెను చూసేందుకు మధ్యంతర బెయిలు ఇవ్వాలని కోరుతూ గత నెల 14న హైకోర్టులో పిటిషన్ వేశాడు. దీంతో అదే నెల 15 నుంచి 28 వరకు కోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. గడువు ముగిసిన తర్వాత 28న సాయంత్రం ఆయన లొంగిపోయాడు.

అయితే, మార్చి ఒకటో తేదీన బోరుగడ్డ హైకోర్టులో మరో పిటిషన్ వేస్తూ మధ్యంతర బెయిలును పొడిగించాలని కోరాడు. తల్లికి తాను ఒక్కడినే కుమారుడినని, ప్రస్తుతం ఆమె చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని, రెండు వారాలపాటు చికిత్స అవసరమని కాబట్టి మధ్యంతర బెయిలు పొడిగించాలని విజ్ఞప్తి చేశాడు. ఈ వాదనకు బలం చేకూరేలా గుంటూరులోని లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చీఫ్ కార్డియాలజిస్ట్ పీవీ రాఘవశర్మ ఇచ్చినట్టుగా ఓ మెడికల్ సర్టిఫికెట్‌ను సమర్పించాడు.

అయితే, పోలీసుల తరపున వాదనలు వినిపించిన ఏపీపీ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. బోరుగడ్డ సమర్పించిన మెడికల్ సర్టిఫికెట్‌లోని వాస్తవికతను నిగ్గు తేల్చేందుకు పోలీసులకు అనుమతినిచ్చింది. ఒకవేళ తప్పుడు ధ్రువీకరణ పత్రం అని తేలితే చర్యలు ఉంటాయని హెచ్చరిస్తూ మార్చి 11 వరకు బోరుగడ్డకు మధ్యంతర బెయిలు ఇచ్చింది.

పోలీసుల విచారణలో బోరుగడ్డ సమర్పించిన మెడికల్ సర్టిఫికెట్ నకిలీదని తేలింది. బోరుగడ్డ తల్లి పద్మావతి చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందడం నిజమే అయినా, ఆమె ఫిబ్రవరిలోనే డిశ్చార్జ్ అయినట్టు గుర్తించారు. దీంతో సర్టిఫికెట్ ఇచ్చినట్టుగా చెబుతున్న లలిత ఆసుపత్రి వైద్యులను సంప్రదించారు. తాము అలాంటి సర్టిఫికెట్ ఇవ్వలేదని, పద్మావతి తమ వద్ద చికిత్స పొందలేదని చెప్పారు. పద్మావతికి సంబంధించి తాము ఎలాంటి మెడికల్ సర్టిఫికెట్ ఇవ్వలేదని ఆసుపత్రి చీఫ్ కార్డియాలజిస్ట్ పీవీ రాఘవశర్మ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో తప్పుడు సర్టిఫికెట్‌తో కోర్టును మోసగించిన అనిల్ వ్యవహారాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఆయనపై మరో కేసు నమోదు చేయాలని యోచిస్తున్నారు. కాగా, తప్పుడు సర్టిఫికెట్‌తో కోర్టును మోసగించిన బోరుగడ్డ ఎక్కడ ఉంటున్నాడు? ఏం చేస్తున్నాడన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Borugadda Anil
YSRCP
Rajamahendravaram Central Jail
AP High Court
  • Loading...

More Telugu News