P Narayana: రాజధాని అమరావతిపై మంత్రి నారాయణ కీలక ప్రకటన

- మూడేళ్లలో రాజధానిని పూర్తి చేస్తామన్న మంత్రి
- నిర్మాణానికి ప్రజలు కట్టే పన్నుల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోమని స్పష్టీకరణ
- హడ్కో, ప్రపంచ బ్యాంకు రుణాలతో రాజధానిని నిర్మిస్తామని వెల్లడి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని మూడేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజలు చెల్లించే పన్నుల నుంచి రాజధాని నిర్మాణం కోసం ఒక్క రూపాయి కూడా వినియోగించబోమని స్పష్టం చేశారు. హడ్కో, ప్రపంచ బ్యాంకు రుణాలతో అమరావతిని నిర్మిస్తామని వెల్లడించారు. రాజధాని విషయంలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు మూడు ముక్కలాట ఆడారని విమర్శించారు.
రాజధాని విషయంలో వైసీపీ ఇప్పటికైనా ఒక విధానంతో ముందుకు రావాలని సూచించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో వైసీపీ నాయకులు ఒత్తిడికి గురయ్యారని ఎద్దేవా చేశారు. అందుకే రాజధాని విషయమై జగన్, ఆ పార్టీ నేతలు సైకోల్లా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
అమరావతిలో భూముల అమ్మకం ద్వారా వచ్చిన నిధులను మాత్రమే రాజధాని నిర్మాణం కోసం వినియోగిస్తామని స్పష్టం చేశారు. అమరావతిలో రోడ్లు, డ్రైనేజీ, పార్కులు వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేస్తే ధరలు పెరుగుతాయని తెలిపారు. బడ్జెట్‌లో రాజధాని కోసం కేటాయించిన రూ. 6 వేల కోట్లను ప్రజలు చెల్లించిన పన్నుల నుంచి మాత్రం తీసుకోబోమని వివరించారు.