Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నాంపల్లి ప్రత్యేక కోర్టులో భారీ ఊరట

- రాజాసింగ్‌కు మూడు కేసుల్లో భారీ ఊరట
- విద్వేషపూరిత ప్రసంగం, ఎన్నికల ర్యాలీ, శ్రీరామ నవమి ర్యాలీ అనుమతి ఉల్లంఘనలపై కేసులు
- రాజాసింగ్‌ను నిర్దోషిగా ప్రకటించిన ప్రత్యేక కోర్టు
గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్‌కు మూడు కేసుల్లో ఊరట లభించింది. ఇదివరకే పలు కేసుల్లో ఆయన నిర్దోషిగా తేలగా, తాజాగా నాంపల్లిలోని ప్రత్యేక కోర్టు మరో మూడు కేసుల్లో ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. విద్వేషపూరిత ప్రసంగం, ఎన్నికల ర్యాలీ, శ్రీరామ నవమి ర్యాలీ అనుమతి ఉల్లంఘనకు సంబంధించి గతంలో ఆయనపై ఈ మూడు కేసులు నమోదయ్యాయి.
ఈ కేసులను విచారించిన ప్రత్యేక కోర్టు రాజాసింగ్‌ను నిర్దోషిగా తేల్చింది. ఆయనపై మంగళ్‌హాట్, షాహినాయత్ గంజ్ పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి.
గత శుక్రవారం ఆయనపై ఉన్న విద్వేషపూరిత ప్రసంగం కేసులను ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఆయనపై ఐదు పోలీస్ స్టేషన్లలో విద్వేషపూరిత ప్రసంగం కేసులు నమోదై ఉన్నాయి. ఈ కేసులపై విచారణ జరిపిన ప్రజాప్రతినిధుల కోర్టు వాటిని కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది.