Nitin Gadkari: రోడ్డు ప్రమాదాలపై నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు

- సివిల్ ఇంజినీర్లు, కన్సల్టెంట్ల తప్పిదాల వల్లే ప్రమాదాలు పెరుగుతున్నాయన్న గడ్కరీ
- ప్రణాళిక, రూపకల్పన సరిగ్గా లేకపోవడం వల్లే ప్రమాదాలు పెరుగుతున్నాయని వ్యాఖ్య
- చిన్న చిన్న పనులను సక్రమంగా నిర్వర్తించడం లేదన్న నితిన్ గడ్కరీ
రోడ్డు ప్రమాదాలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. సివిల్ ఇంజినీర్లు, కన్సల్టెంట్ల తప్పిదాల వల్లే దేశంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. గ్లోబల్ రోడ్ ఇన్‌ఫ్రాటెక్ సమ్మిట్ అండ్ ఎక్స్‌పో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశంలో అధ్వానమైన సమగ్ర ప్రాజెక్టు నివేదికలు తయారు చేస్తున్నారని విమర్శించారు. వాటి ప్రణాళిక, రూపకల్పన సరిగ్గా లేకపోవడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని అన్నారు.
సివిల్ ఇంజినీర్లు చేస్తున్న చిన్న చిన్న తప్పిదాల వల్లే దేశంలో చాలా వరకు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. లోపాలతో కూడిన డీపీఆర్ అందించడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నట్లు చెప్పారు. వీటికి ఎవరూ బాధ్యత వహించడం లేదని, ముఖ్యంగా రోడ్డు సిగ్నల్స్, మార్కింగ్ సిస్టం ఏమాత్రం బాగా లేదని అన్నారు. చిన్న చిన్న పనులను కూడా సక్రమంగా నిర్వర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
స్పెయిన్, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ తదితర దేశాల నుండి ఎంతో నేర్చుకోవాల్సి ఉందని అన్నారు. 2023లో రోడ్డు ప్రమాదాల కారణంగా దేశంలో 1,80,000 మంది మృత్యువాత పడ్డారని తెలిపారు. 2030 నాటికి రోడ్డు ప్రమాదాల సంఖ్యను 50 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు.