Baapu: థియేటర్లలో సాధ్యం కానిది ఓటీటీల్లో సాధ్యమయ్యేనా?

- విలేజ్ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ డ్రామా 'బాపు'
- ఈ నెల 7వ తేదీ నుంచి జియో హాట్ స్టార్ లో
- తండ్రీకొడుకుల ఎమోషన్స్ తో ముడిపడిన 'రామం రాఘవం'
- ఈ నెల 14 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్
థియేటర్ కి వెళ్లి ఒక సినిమా చూడాలంటే ఆ సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి అనే భావించే వారు ఎక్కువమందే ఉంటారు. లేదంటే సాంకేతిక పరంగా అద్భుతాలు జరగకపోయినా, కథ గొప్పగా ఉందనే టాక్ రావాలి. అప్పుడు గానీ థియేటర్ల దిశగా వెళ్లడం లేదు. కదిలించే కథ ఉంటే చాలు... బడ్జెట్ తో పనేముంటుంది? భారీతనంతో పనేముంటుంది? అనే విషయాన్ని 'బలగం' నిరూపించింది.
నిజం చెప్పాలంటే 'బలగం' సినిమా, గ్రామీణ నేపథ్యంతో కూడిన కథలకు కొత్త ఊపిరి పోసిందని చెప్పాలి. విదేశాల్లో విలేజ్ సెట్లు వేసి షూటింగులు చేస్తున్న సమయంలో, గ్రామీణ ప్రాంతాలకు ఆ సినిమా జీవకళ తెచ్చిపెట్టింది. గ్రామాలలో సినిమాల సందడిని పెంచింది. ఎమోషన్స్ ప్రధానమైన కుటుంబ కథలు రాయడానికి... రావడానికి కారణమైంది. అందుకు నిదర్శనంగా నిలిచిన సినిమాలుగా 'బాపు' .. 'రామం రాఘవం' కనిపిస్తాయి.
బ్రహ్మాజీ - ఆమని ప్రధానమైన పాత్రలను పోషించిన 'బాపు' సినిమా, ఫిబ్రవరి 21న థియేటర్లకు వచ్చింది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమా, ఈ నెల 7వ తేదీ నుంచి 'జియో హాట్ స్టార్' లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ధన్ రాజ్ - సముద్రఖని ప్రధానమైన పాత్రలను పోషించిన 'రామం రాఘవం తండ్రీకొడుకుల ఎమోషన్స్ తో ముడిపడిన కథ. ఈ సినిమా కూడా ఫిబ్రవరి 21న విడుదలైంది. ఈ నెల 14 నుంచి 'ఈటీవీ విన్' లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్ల నుంచి ఆశించిన రెస్సాన్స్ ను ఈ సినిమాలు ఓటీటీ వైపు నుంచి తెస్తాయా అనేది చూడాలి.
