Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్... బెయిల్ ఇవ్వొద్దన్న పీపీ

- బెయిల్ పిటిషన్ ను విచారించిన విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు
- వంశీ నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉందన్న పీపీ
- అనారోగ్యంతో ఉన్న వంశీకి బెయిల్ ఇవ్వాలని కోరిన ఆయన తరపు న్యాయవాదులు
కిడ్నాప్ కేసులో రిమాండ్ లో ఉన్న వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ ను విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టు ఈరోజు విచారించింది. వంశీకి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. పోలీస్ కస్టడీలో విచారించిన సమయంలో కీలక సమాచారం తెలిసిందని చెప్పారు. వంశీ ఆదేశాలతోనే సత్యవర్ధన్ ను కలిశామని ఈ కేసులో ఉన్న మరో ఇద్దరు నిందితులు అంగీకరించారని తెలిపారు. వంశీకి బెయిల్ ఇవ్వొద్దని కోరారు. వంశీ నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని... అందుకే 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశామని తెలిపారు.
వల్లభనేని వంశీ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ... సత్యవర్ధన్ కిడ్నాప్ తో వంశీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. వంశీపై రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు కేసు పెట్టిందని అన్నారు. వంశీ అనారోగ్యంతో బాధపడుతున్నారని... ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఈనెల 10వ తేదీకి వాయిదా వేసింది.