Anurag Kashyap: విషపూరితమైన బాలీవుడ్ ని వదిలేశా: ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్

- బాలీవుడ్ కేవలం బాక్సాఫీస్ నంబర్లనే చూస్తోందన్న అనురాగ్ కశ్యప్
- క్రియేటివిటీకి ప్రాధాన్యతను ఇవ్వడం లేదని విమర్శ
- వచ్చే ఏడాది ముంబై వదిలి వెళ్లిపోతానని వ్యాఖ్య
హిందీ సినీ రంగంపై ప్రముఖ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. విషపూరితంగా మారిన బాలీవుడ్ ను తాను వదిలేశానని ఆయన స్పష్టం చేశారు. బాలీవుడ్ కేవలం బాక్సాఫీస్ నంబర్లనే చూస్తోందని... క్రియేటివిటీకి అతి తక్కువ ప్రాధాన్యతను ఇస్తోందని దుయ్యబట్టారు. ప్రతి ఒక్కరూ అవాస్తవిక లక్ష్యాలను పెట్టుకుంటున్నారని... రూ. 500 కోట్లు లేదా రూ. 800 కోట్లు వసూలు చేసే సినిమాలను నిర్మించాలనుకుంటున్నారని అన్నారు. బాలీవుడ్ లో సృజనాత్మకత చచ్చిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తన సొంత బాలీవుడ్ పరిశ్రమ పరిస్థితిని చూసి తాను ఎంతో అసంతృప్తి చెందుతున్నానని అనురాగ్ కశ్యప్ చెప్పారు. క్రియేటివిటీకి ప్రాధాన్యత లేని బాలీవుడ్ లో తాను ప్రయోగాలు చేయలేనని అన్నారు. బాలీవుడ్ లో అందరూ లాభాలను మాత్రమే చూస్తున్నారని చెప్పారు. 'నా మార్జిన్ ఎంత... నేను నష్టపోతానేమో... ఈ సినిమా వద్దు' అని బాలీవుడ్ నిర్మాతలు అంటుంటారని విమర్శించారు.
సినిమా షూటింగ్ ప్రారంభంకావడానికి ముందు నుంచే సినిమాను ఎలా సేల్ చేయాలని ఆలోచిస్తుంటారని దుయ్యబట్టారు. దీనివల్ల మంచి సినిమా తీయాలనే ఆసక్తి కూడా చచ్చిపోతోందని అన్నారు. అందుకే తాను బాలీవుడ్ ని వదిలేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. వచ్చే ఏడాది తాను ముంబైని వదిలి వెళతానని అన్నారు.
సినిమాల విషయానికి వస్తే... టాలీవుడ్ లో అడివి శేష్, మృణాళ్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రంలో అనురాగ్ కశ్యప్ కీలక పాత్రను పోషించారు. ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. విడుదల తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది. మరోవైపు, అనురాగ్ కశ్యప్ బెంగళూరుకు షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.