Vada: నేటి నుంచి తిరుమల అన్నప్రసాదం మెనూలో వడలు

- వడలు వడ్డిస్తామని గతంలోనే చెప్పిన బీఆర్ నాయుడు
- నేటి నుంచి అమలు
- రోజుకు 35 వేల వడలు వడ్డిస్తామన్న టీటీడీ చైర్మన్
తిరుమలలో నేటి నుంచి అన్నప్రసాదంలో కొత్తగా వడలు కూడా వడ్డించనున్నారు. ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గతంలోనే వెల్లడించారు. తాజాగా ఆయన సోషల్ మీడియాలో స్పందించారు. టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించాక అన్నప్రసాదం మెనూలో అదనంగా మరో పదార్థం పెట్టాలన్న ఆలోచన కలిగిందని చెప్పారు. తన ఆలోచనను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానని, ఆయన ఆమోదంతో నేడు అన్నప్రసాదంలో వడలను ప్రవేశపెట్టామని వివరించారు.
"అధికారులు నాణ్యమైన దినుసులతో రూపొందించిన రుచికరమైన అన్నప్రసాదాలను భక్తులకు వడ్డిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అన్నప్రసాదంలో వడలు వడ్డిస్తాం. రోజుకు 35 వేల వడలు వడ్డిస్తాం. భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింత పెంచి భక్తులకు రుచికరమైన భోజనం అందిస్తాం" అని బీఆర్ నాయుడు వివరించారు.



