Nayanatara: నేరుగా ఓటీటీకి నయనతార థ్రిల్లర్ మూవీ!

- నయనతార ప్రధాన పాత్రను పోషించిన 'టెస్ట్'
- థియేటర్లకు వెళ్లలేకపోయిన సినిమా
- ఏప్రిల్ 4 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్
- క్రికెట్ మ్యాచ్ నేపథ్యంలో నడిచే కథ
తమిళనాట నయనతారకి గల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఆమె సినిమా ఒకటి సెట్స్ పైకి వెళ్లిందంటే, అది థియేటర్స్ కి వచ్చేంత వరకూ అభిమానులు ఆసక్తిని కనబరుస్తూనే ఉంటారు. అలాంటిది ఆమె నటించిన 'టెస్ట్' సినిమా మాత్రం విడుదలకి దూరంగా ఉండిపోయింది. దాంతో ఈ సినిమా టీమ్, నేరుగా ఓటీటీకి తీసుకొచ్చే ప్లాన్ చేసింది.
ఫలితంగా ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ద్వారా ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నారు. ఏప్రిల్ 4వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టు చెబుతూ, అధికారిక పోస్టర్ ను వదిలారు. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకి శశికాంత్ దర్శకత్వం వహించాడు.
నయనతారతో పాటు మాధవన్ .. సిద్ధార్థ్ కీలకమైన పాత్రలను పోషించగా, ప్రత్యేకమైన పాత్రలో మీరా జాస్మిన్ కనిపించనుంది. చెన్నై క్రికెట్ స్టేడియంలో టీమిండియా టెస్ట్ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. ఆ మ్యాచ్ చూడటానికి వెళ్లిన ముగ్గురు వ్యక్తులు ఎలాంటి చిక్కుల్లో పడతారు? ఆ చిక్కులలో నుంచి బయటపడటానికి వారు ఏం చేస్తారు? అనేది కథ. ఈ సినిమా ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి మరి.