Tamilnadu: తమిళనాడులో తమిళానికి ప్రాధాన్యత ఇవ్వాలంటున్నాం: సీఎం స్టాలిన్

- ఎన్ఈపీని విమర్శిస్తూ తమిళనాడు సీఎం మరో సంచలన పోస్టు
- సమానత్వం కోరడం పక్షపాతం ఎలా అవుతుందని ప్రశ్నించిన స్టాలిన్
- ప్రత్యేక హక్కులకు అలవాటు పడిన వారికి సమానత్వం అణచివేతలా కనిపిస్తుందని వ్యాఖ్య
తమిళనాడులో తమిళ భాషకు ప్రాధాన్యత ఇవ్వాలని తాము కోరుతున్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వివరణ ఇచ్చారు. భాషా సమానత్వం కోరడం పక్షపాతం ఎలా అవుతుందని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈమేరకు గురువారం ఆయన ట్విట్టర్ లో పోస్టు పెట్టారు. కేంద్ర నూతన జాతీయ విద్యా విధానాన్ని తమిళనాడు వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. తాము భాషా సమానత్వాన్నే కోరుకుంటున్నామని, పక్షపాతం చూపించమని అడగటం లేదని వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఫ్రాంక్లిన్ లియోనార్డ్ చెప్పిన సూక్తిని స్టాలిన్ తన ట్వీట్ లో ప్రస్తావించారు.
‘మీరు ప్రత్యేక హక్కులకు అలవాటుపడిన తర్వాత.. సమానత్వం అణచివేతలానే కనిపిస్తుంది’ అని కోట్ చేశారు. తమిళులపై హిందీ భాషను రుద్దుతామంటే తాము ఒప్పుకోబోమని స్టాలిన్ తేల్చిచెప్పారు. మతోన్మాదాన్ని, పక్షపాతాన్ని తాము కోరుకోవట్లేదని అన్నారు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు వర్తించే నేర చట్టాలను హిందీలో రూపొందించారని స్టాలిన్ మండిపడ్డారు. తమిళులకు కనీసం పలకలేని, అర్థం చేసుకోలేని భాషలో ఉన్న చట్టాలు తమకు ఎలా ఉపయోగపడతాయని నిలదీశారు. దీనినే మతోన్మాదం అంటారని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై స్టాలిన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.