Bollywood: బాలీవుడ్ ను వీడుతూ సంచలన వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్ అనురాగ్ కశ్యప్

- ఇండస్ట్రీని విషతుల్యంగా మార్చేశారన్న అనురాగ్
- రియేటివ్ ఫ్రీడమ్ కు అవకాశం లేదని ఆరోపణ
- బాక్సాఫీస్ వద్ద రాబడుల లెక్కలకే ప్రాధాన్యమని విమర్శ
బాలీవుడ్ విషతుల్యంగా మారిపోయిందని, బాక్సాఫీసు వద్ద లెక్కలకే ప్రాధాన్యం తప్ప క్రియేటివ్ ఫ్రీడమ్ కు చోటులేకుండా మార్చేశారని ప్రముఖ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ తీవ్ర విమర్శలు చేశారు. గతేడాది బాలీవుడ్ లో ఇమడలేక తీవ్రంగా ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చారు. అందుకే బాలీవుడ్ ను వదిలేస్తున్నానని సంచలన ప్రకటన చేశారు. బాలీవుడ్ కు సంబంధించిన వారందరికీ దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు తాజాగా ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. సృజనాత్మకతకు ఏమాత్రం విలువ లేకుండా పోయిందని, ప్రతీ ఒక్కరూ 500 కోట్లు, 800 కోట్లు వసూలు చేయడమే టార్గెట్ గా సినిమాలు రూపొందించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
బాక్సాఫీసు వద్ద రాబట్టిన వసూళ్ల ఆధారంగా సినిమాను జడ్జ్ చేస్తున్నారంటూ ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా మొదలుపెట్టక ముందు నుంచే దానిని ఎంతకు అమ్మొచ్చు, ఎంత రాబట్టవచ్చని నిర్మాతలు ఆలోచిస్తున్నారని, దీంతో సినిమా తెరకెక్కించే సమయంలో తనకు సంతోషమనేది లేకుండా పోతోందని చెప్పారు. అందుకే తాను ఇండస్ట్రీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాదికల్లా తాను ముంబైని వదిలి వేరే ప్రాంతానికి వెళ్లిపోతానని కశ్యప్ చెప్పారు. కాగా, ఆయన బెంగళూరుకు షిఫ్ట్ కానున్నారని సమాచారం.