Road Accident: లారీని ఢీకొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.. ముగ్గురి మృతి

- హైదరాబాద్ నుంచి కాకినాడ వెళుతుండగా ఏలూరు జిల్లాలో ప్రమాదం
- మరో 20 మందికి తీవ్ర గాయాలు
- కడప జిల్లాలో జరిగిన మరో ప్రమాదంలో ముగ్గురి మృతి
- 50 అడుగుల లోయలో పడటంతో మూడు ముక్కలైన లారీ
హైదరాబాద్ నుంచి కాకినాడ వెళుతున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు ముందు వెళుతున్న లారీని వెనక నుంచి బలంగా ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఏలూరు జిల్లా చోదిమెళ్ల వద్ద ఈ తెల్లవారుజామున జరిగిందీ ఘటన. గాయపడిన వారిని వెంటనే ఏలూరు ఆసుపత్రికి తరలించారు. అతివేగంగా ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి ముందు వెళుతున్న సిమెంట్ లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సులోని ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.
వైఎస్సార్ జిల్లాలో మరో ముగ్గురు
వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని మద్దిమడుగు ఘాట్ రోడ్‌లో జరిగిన మరో ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. చేపల మేత లోడుతో బెంగళూరు నుంచి ఏలూరుకు వెళుతున్న లారీ మద్దిమడుగు ఘాట్ పైన నాలుగో మలుపు వద్దకు రాగానే బ్రేక్ ఫెయిలై అదుపు తప్పి 50 అడుగుల లోయలో పడిపోయింది. డ్రైవర్ సాంబయ్య, క్లీనర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. చక్రాయపేట మండలం కప్పకుంటపల్లెకు చెందిన కె. వివేకానందరెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 50 అడుగుల లోయలో పడిపోవడంతో లారీ మూడు ముక్కలైంది.