Mushfiqur Rahim: వన్డేలకు బంగ్లాదేశ్ వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం వీడ్కోలు

- చాంపియన్స్ ట్రోఫీలో చివరి మ్యాచ్ ఆడేసిన ముష్ఫికర్ రహీం
- ఆడిన రెండు మ్యాచుల్లోనూ విఫలం
- గత వారం రోజులుగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానన్న వెటరన్
- 2006లో జింబాబ్వేతో మ్యాచ్‌లో అరంగేట్రం
బంగ్లాదేశ్ వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం (37) వన్డేలకు వీడ్కోలు పలికాడు. పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్ జట్టు లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. ఆడిన రెండు మ్యాచుల్లోనూ ముష్ఫికర్ విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో వన్డేలకు వీడ్కోలు పలకడం ప్రాధాన్యం సంతరించుకుంది. కెరీర్ మొత్తం ఎంతో నిజాయతీతో, అంకితభావంతో పనిచేశానని, అయితే, గత వారం రోజుల్లో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానని చెప్పాడు.
2006లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌తో వన్డేల్లో అరంగేట్రం చేసిన ముష్ఫికర్ రహీం 274 మ్యాచుల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. 7,795 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 49 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 144 పరుగులు. అలాగే, కీపర్‌గా 243 క్యాచ్‌లు అందుకున్నాడు. 56 స్టంప్ ఔట్స్ చేశాడు.