Bride Gives Birth To Baby: పెళ్లయిన రెండ్రోజులకే బిడ్డ పుట్టింది... మోసపోయామంటున్న వరుడి కుటుంబం

- వివాహం అయిన రెండో రోజే బిడ్డకు జన్మనిచ్చిన నవ వధువు
- షాక్ కు గురైన వరుడి కుటుంబ సభ్యులు
- ఆమెను భార్యగా స్వీకరించేందుకు నిరాకరణ
- ఆ బిడ్డకు తండ్రి ఎవరో చెప్పాలని డిమాండ్
అత్తారింట అడుగుపెట్టిన రెండో రోజే ఓ బిడ్డకు జన్మనిచ్చి వరుడి కుటుంబానికి షాక్ ఇచ్చింది ఓ నవ వధువు. కాళ్ల పారాణి ఆరకమునుపే ఒక బిడ్డకు జన్మనివ్వడం వరుడి కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగింది.
గత నెల 24వ తేదీన ఓ జంటకు ఎంతో వేడుకగా వివాహం జరిగింది. ఎన్నో కలలతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన ఆ నవ వరుడికి వివాహం అయిన రెండో రోజే భయంకరమైన నిజం వెల్లడి కావడంతో నిర్ఘాంతపోయాడు. దీంతో వీరి వివాహ బంధం మూడునాళ్ల ముచ్చటైంది.
వివాహం అయిన మరుసటి రోజే నవ వధువు అత్తారింట అడుగు పెట్టింది. ఫిబ్రవరి 26న ఉదయం నవ వరుడి కుటుంబ సభ్యులకు టీ కూడా కాచి ఇచ్చింది. ఆ రోజు సాయంత్రమే ఆమె తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుంటే నవ వరుడు, అతని కుటుంబ సభ్యులు సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లారు.
ఆ యువతికి పురిటినొప్పులు వచ్చాయని, బిడ్డకు జన్మనిచ్చిందని వైద్యుడు చెప్పడంతో వరుడు, అతడి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. డెలివరీ చేసిన వైద్య సిబ్బంది ఓ బిడ్డను వారి చేతిలో పెట్టారు. ఈ పరిణామంతో కంగుతిన్న నవ వరుడు తాము మోసపోయామంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమెను భార్యగా స్వీకరించేందుకు నిరాకరించాడు.
ఈ విషయంపై వరుడి సోదరి మీడియాతో మాట్లాడుతూ.. పెళ్లి సమయంలో వధువు పెద్ద లెహంగా ధరించిందని, దీంతో ఆమె గర్భవతి అన్న అనుమానం రాలేదని చెప్పింది. శోభనం రోజున కొత్త జంట విడిగా ఉన్నారని తెలిపింది. ఈ బిడ్డకు తండ్రి ఎవరో ఆమె చెప్పాలని డిమాండ్ చేసింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.