Ram Gopal Varma: కేసు కొట్టివేయాలంటూ హైకోర్టులో వర్మ క్వాష్ పిటిషన్

RGV files petition in AP high court

  • ఆర్జీవీ ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ సినిమా వివాదం
  • ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారని రాంగోపాల్ వర్మపై అభియోగాలు
  • మంగళగిరికి చెందిన వంశీకృష్ణ ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు
  • తదుపరి చర్యలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని క్వాష్ పిటిషన్

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమని, రాజకీయ దురుద్దేశంతోనే ఈ కేసు నమోదు చేశారని పిటిషన్‌లో వర్మ పేర్కొన్నారు. సీబీఎఫ్‌సీ ధ్రువపత్రం జారీ చేసిన తర్వాత 2019లో ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా విడుదల చేశామని, 2024లో తనపై కేసు నమోదు చేయడంలో అర్థం లేదని పేర్కొన్నారు. ఈ కేసులో సీఐడీ నమోదు చేసిన సెక్షన్లు చెల్లవని, ఈ కేసు ఆధారంగా తీసుకోబోయే తదుపరి చర్యలను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని రాంగోపాల్ వర్మ హైకోర్టును అభ్యర్థించారు.

ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళితే.. 2019లో 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' పేరుతో ఆర్జీవీ ఒక సినిమాను రూపొందించారు. 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' పేరుతో సినిమాను రిలీజ్ చేశారు. యూట్యూబ్‌లో మాత్రం 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' పేరుతోనే విడుదల చేశారంటూ మంగళగిరి సమీపంలోని ఆత్మకూరుకు చెందిన బండారు వంశీకృష్ణ సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలను కూడా తొలగించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ మనోభావాలు దెబ్బతినేలా సినిమా తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మంగళగిరిలోని సీఐడీ పోలీస్ స్టేషన్‌లో గతేడాది నవంబర్ 29న కేసు నమోదైంది. ఈ క్రమంలో ఆర్జీవీకి సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు.

Ram Gopal Varma
Kamma Rajyamlo Kadapa Redlu
AP High Court
  • Loading...

More Telugu News