YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో సాక్షి వాచ్ మన్ రంగన్న అనారోగ్యంతో మృతి

- అస్వస్థతకు గురైన రంగన్నను కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించిన పోలీసులు
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన వైనం
- గతంలోనే సాక్షిగా రంగన్న సీబీఐకి కీలక విషయాల వెల్లడి
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షి, వాచ్‌మన్ రంగన్న (85) అనారోగ్యంతో కన్నుమూశారు. వయోభారం కారణంగా ఆయన కొంతకాలంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆయనను కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
2019 మార్చి 15న పులివెందులలో వివేకానంద రెడ్డి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వివేకా నివాసంలో వాచ్‌మెన్‌గా పనిచేసిన రంగన్న నుంచి సీబీఐ అధికారులు వాంగ్మూలం సేకరించారు. ఆ సమయంలో ఆయన పలు కీలక విషయాలను సీబీఐకి తెలియజేసినట్లు సమాచారం. వివేకా కేసులో రంగన్నను కీలక సాక్షిగా పేర్కొంటూ సీబీఐ ఛార్జ్‌షీట్‌లో కూడా పలు అంశాలు పొందుపరిచింది.