Champions Trophy 2025: కొండంత టార్గెట్ ఇచ్చిన కివీస్... సఫారీలు కొడతారా, కుదేలవుతారా?

- ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ × దక్షిణాఫ్రికా
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్
- 50 ఓవర్లలో 6 వికెట్లకు 362 పరుగులు
- సెంచరీల మోత మోగించిన రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్
ఛాంపియన్స్ ట్రోఫీ రెండో సెమీస్ లో న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ పోటీలు పడి బంతిని చితకబాదారు. లాహోర్ స్టేడియంలో దక్షిణాఫ్రికా బౌలింగ్ ను చీల్చిచెండాడుతూ యంగ్ ఓపెనర్ రచిన్ రవీంద్ర (108), మాజీ సారథి కేన్ విలియమ్సన్ (102) సెంచరీలతో పరుగుల మోత మోగించగా... గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్ మెరుపు ఇన్నింగ్స్ లతో అదరగొట్టారు.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 362 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్ విల్ యంగ్ 21 పరుగులు చేసి అవుట్ కాగా... రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ జోడీ వీరవిహారం చేసింది.
రవీంద్ర 101 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్ తో 108 పరుగులు చేయగా.... విలియమ్సన్ 94 బంతుల్లోనే 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 102 పరుగులు చేశాడు. వీరిద్దరూ రెండో వికెట్ కు 164 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేయడం విశేషం.
ఇక... డారిల్ మిచెల్ 37 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ తో 49 పరుగులు చేయగా... గ్లెన్ ఫిలిప్స్ 27 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ తో 49 పరుగులతో అజేయంగా నిలిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి 3, కగిసో రబాడా 2, వియాన్ ముల్డర్ 1 వికెట్ తీశాడు.
ఇటీవల కాలంలో ప్రధాన బౌలర్ గా ఎదిగిన మార్కో యన్సెన్ ఒక్క వికెట్ తీయకపోగా, 10 ఓవర్లలో 79 పరుగులు సమర్పించుకున్నాడు. అటు, ఎంగిడి, రబాడా వంటి సీనియర్ బౌలర్లు సైతం ఓవర్ కు 7 చొప్పున పరుగులు ఇచ్చారు.