Anti Ageing: నిగనిగలాడే చర్మం కోసం రోజూ తినాల్సిన ఆహార పదార్థాలు ఇవే!

5 Anti Ageing Vegetarian Foods You Need For Healthier Skin

  • చర్మంపై వయసు పైబడుతున్న లక్షణాలను దాచేస్తాయట
  • యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయంటున్న నిపుణులు
  • చర్మాన్ని పొడిబారకుండా, మృదువుగా మార్చేస్తాయని వెల్లడి

వయసు పెరుగుతున్న కొద్దీ చర్మంపై మార్పులు సహజం.. పొడిబారడం, కళ్లకింద నల్లటి వలయాలు ఏర్పడడం, డీఎన్ఏ డ్యామేజ్ తదితర లక్షణాలు కనిపిస్తుంటాయి. దీంతో చర్మ సౌందర్యం కోసం రకరకాల క్రీములను ఉపయోగిస్తుంటాం. అయితే, ఈ కృత్రిమ సాధనాలకన్నా రోజూ తినే ఆహారంలో మార్పులు చేసుకుంటే సహజంగానే చర్మం నిగారింపు సంతరించుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. పళ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం ద్వారా చర్మాన్ని కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. ప్రధానంగా ఈ ఐదింటిని డైట్ లో చేర్చుకుంటే కొన్ని రోజుల్లోనే ఫలితం కనిపిస్తుందని అంటున్నారు.

ఆరెంజ్..
విటమిన్ సి పుష్కలంగా ఉండే ఈ ఫ్రూట్ ను రోజూ తీసుకుంటే చర్మంలోని కణాలు మరింత యాక్టివ్ గా మారుతాయని నిపుణులు చెబుతున్నారు. ఆరెంజ్ లో ఒకరకమైన బ్లడ్ ఆరెంజ్ తో చాలా ప్రయోజనాలు ఉన్నాయని వివరించారు. స్కిన్ రిపేర్ కు ఇది ఎంతగానో తోడ్పడుతుందని చెప్పారు. 20 నుంచి 27 ఏళ్ల వయసున్న వారు రోజూ 600 మిల్లీలీటర్ల బ్లడ్ ఆరెంజ్ జ్యూస్ తీసుకుంటే కేవలం 21 రోజుల్లో వారి డీఎన్ఏ డ్యామేజ్ గణనీయంగా తగ్గిపోయిందని నిపుణులు తెలిపారు.

టమాటా..
చర్మం డ్యామేజ్ కాకుండా కాపాడే అతిముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్ ‘ఐసోపెన్’ పుష్కలంగా ఉండే కూరగాయల్లో టమాటా ఒకటని నిపుణులు తెలిపారు. 21 నుంచి 74 ఏళ్ల మధ్య ఉన్న వారు రోజూ 55 గ్రాముల టమాటా పేస్ట్ (ఇందులో 16 ఎంజీ ఐసోపెన్ ఉంటుంది) ను ఆలివ్ ఆయిల్ తో కలిపి తీసుకుంటే 12 వారాల్లో చర్మం నిగారింపు సంతరించుకోవడం గుర్తించవచ్చన్నారు. సూర్యరశ్మి, కాలుష్యం కారణంగా దెబ్బతిన్న చర్మకణాలను ఐసోపెన్ బాగుచేస్తుందని వివరించారు.
 
ఆల్మండ్స్..
విటమిన్ ఈ, మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్, పాలిఫెనాల్స్ అధికంగా ఉండే ఆల్మండ్స్ చర్మ సంరక్షణకు తోడ్పడతాయని నిపుణులు చెబుతున్నారు. 55 నుంచి 80 ఏళ్ల వయసున్న మహిళలు రోజూ ఆల్మండ్స్ తినడం ద్వారా చర్మంపై ముడతలు తగ్గించుకోవచ్చని చెప్పారు. పదహారు వారాలపాటు నిర్వహించిన ఓ అధ్యయనంలో దీనిని నిర్ధారించుకున్నట్లు తెలిపారు.
 
సోయాబీన్స్..
మోనోపాజ్ దశలో ఈస్ట్రోజెన్ స్థాయులు తగ్గిపోవడం వల్ల మహిళలను చర్మ సంబంధిత సమస్యలు వెంటాడుతాయి. చర్మం పొడిబారడం, ముడతలు, గాయాలను మాన్పే శక్తి తగ్గిపోవడం తదితర సమస్యలు ఎదుర్కొంటారు. సోయాబీన్స్ రోజూ తీసుకోవడం ద్వారా ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పలు అధ్యయనాలలో ఈ విషయం నిరూపితమైందని చెప్పారు.
 
కొకోవా..
చర్మ సంరక్షణలో కొకోవా దివ్యౌషధంలా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. రక్తప్రసరణను పెంచి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గించడం ద్వారా చర్మాన్ని కాపాడుతుందని వివరించారు. కొకోవాలోని ఫ్లేవనాల్స్ ఇందుకు తోడ్పడతాయని కొరియా మహిళలపై నిర్వహించిన అధ్యయనంలో తేలిందన్నారు. రోజూ 320 మిల్లీగ్రాముల ఫ్లేవనాల్స్ ఉండే కొకోవా పానీయాలను తీసుకుంటే 24 వారాల తర్వాత చర్మం సాగడం తగ్గుతుందని, ముడతలు తగ్గిపోతాయని చెప్పారు.

  • Loading...

More Telugu News