Narendra Modi: వనతారాలో పర్యటన... పులి పిల్లలకు పాలు తాగించిన ప్రధాని మోదీ... ఫొటోలు ఇవిగో!

- గుజరాత్ లో 3 వేల ఎకరాల్లో వనతారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
- అన్నీ తానై చూసుకుంటున్న అనంత్ అంబానీ
- నేడు వనతారాలో వింతలు, విశేషాలు తిలకించిన ప్రధాని మోదీ
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ కలల ప్రతిరూపం... వనతారా కృత్రిమ అభయారణ్యం. ఇక్కడ రకరకాల జంతు జాతులు, పక్షి జాతులు మనుగడ సాగిస్తున్నాయి.
ముఖ్యంగా, గాయపడిన, వ్యాధుల బారిన పడిన జంతువులకు, పక్షులకు చికిత్స అందిస్తూ, వాటిని జాగ్రత్తగా కాపాడుతుంటారు. గుజరాత్ లోని జామ్ నగర్ వద్ద ఉన్న 3 వేల ఎకరాల స్థలంలో అనంత్ అంబానీ ఒక అద్భుతమైన అరణ్యాన్ని సృష్టించారు. మొత్తమ్మీద ఇది ఒక వన్యప్రాణి పునరావాస కేంద్రం అని చెప్పవచ్చు.
తాజాగా వనతారా అడవిని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. అనంత్ అంబానీ స్వయంగా ప్రధాని వెంట ఉండి... ఈ కృత్రిమ అరణ్యంలోని వింతలు, విశేషాలు వివరించారు. ప్రత్యేక ఎన్ క్లోజర్లలో ఉన్న పులులను, సింహాలను ఆసక్తిగా తిలకించారు. ఏనుగులు, జిరాఫీలు, జీబ్రాలు, హిప్పోలకు ఆహారం అందించారు. పులులు, సింహాల కూనలకు స్వయంగా పాలు తాగించారు.
వనతారా సెంటర్ డాక్టర్లు, ఇతర స్టాఫ్ తో ప్రధాని మోదీ ముచ్చటించారు. మోదీ వచ్చే సమయానికి... ఇక్కడి వైద్య కేంద్రంలో ఓ చిరుతకు శస్త్రచికిత్స జరుగుతోంది. మోదీ ఆ శస్త్రచికిత్స జరుగుతున్న తీరును పరిశీలించారు. ఓ ఏనుగుకు ఎంఆర్ఐ స్కానింగ్ జరుగుతుంటే, అక్కడికి కూడా వెళ్లారు. ఇక్కడి వైల్డ్ లైఫ్ రీసెర్చ్ సెంటర్ లోని ల్యాబ్ ను కూడా పరిశీలించారు.










