Payyavula Keshav: పేదవాడి బువ్వ లాక్కున్నందుకు 11 స్థానాలే వచ్చాయి: పయ్యావుల కేశవ్

- వైసీపీ ఎమ్మెల్యేలపై పయ్యావుల కేశవ్ విమర్శలు
- అసెంబ్లీకి రాకుండా బయట ఉండి విమర్శలు గుప్పిస్తున్నారని మండిపాటు
- గత లోపాలను ఎత్తి చూపుతారనే ముఖం చాటేస్తున్నారని విమర్శ
వైసీపీ ఎమ్మెల్యేలపై ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి రాకుండా బయట ఉండి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని విమర్శించారు. ఉన్నవి లేనివి కల్పించి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీకి వస్తే గత లోపాలను ఎత్తి చూపుతారనే ముఖం చాటేస్తున్నారని అన్నారు. చేసిన పాపాలు వెంటాడటం వల్లే అసెంబ్లీ రాలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.
ఐదేళ్ల పాలనలో వైసీపీ ఆర్థిక విధ్వంసం సృష్టించిందని పయ్యావుల అన్నారు. ఆనాడు ప్రతిపక్షాల గొంతు నొక్కడం పైనే దృష్టి సారించారని విమర్శించారు. పేదవాడి బువ్వ లాక్కున్నందుకు 11 స్థానాలకే పరిమితమయ్యారని అన్నారు. బడ్జెట్ లో వెలిగొండ ప్రాజెక్ట్ కు నిధులు కేటాయించలేదని అంటున్నారని... ప్రాజెక్ట్ పూర్తయిందని, జాతికి అంకితం చేశామని వైసీపీ హయాంలో చెప్పుకున్నారని గుర్తు చేశారు. పూర్తయిన ప్రాజెక్ట్ కు కేటాయింపులు ఎలా చేస్తారని ఎద్దేవా చేశారు.