Leopard: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో మరోసారి చిరుత కలకలం

- రెండేళ్ల కిందట అలిపిరి నడక మార్గంలో బాలికను చంపేసిన చిరుత
- ఈ మార్గంలో తరచుగా చిరుతపులుల సంచారం
- భయాందోళనలకు గురవుతున్న భక్తులు
రెండేళ్ల కిందట తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో ఆరేళ్ల బాలికను చిరుతపులి చంపేసిన ఘటన తర్వాత కాలినడకన కొండపైకి వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తరచుగా అలిపిరి నడక మార్గంలో చిరుత పులులు దర్శనమిస్తుండడంతో భక్తులు భయాందోళనలకు గురవుతున్నారు.
తాజాగా, మరోసారి మెట్ల మార్గంలో చిరుత కలకలం రేగింది. అర్ధరాత్రి దాటాక ఒంటి గంట సమయంలో గాలి గోపురం వద్ద చిరుతపులి కనిపించింది. అది ఓ పిల్లిని వేటాడి అడవిలోకి తీసుకెళ్లింది. ఈ మేరకు సీసీ కెమెరాల్లో రికార్డయింది. గత రాత్రి తిరుపతిలోని జూ పార్క్ రోడ్డులోనూ చిరుతపులి కనిపించినట్టు తెలిసింది.
కాగా, టీటీడీ రాత్రి 10 గంటల తర్వాత నడక మార్గాల్లో భక్తులను అనుమతించడంలేదు. అటు, 12 ఏళ్ల లోపు చిన్నారులను మధ్యాహ్నం 2 గంటల లోపే నడక మార్గంలో తీసుకెళ్లేందుకు అనుమతిస్తున్నారు.