Roja: ఆరేళ్ల క్రితం మాట్లాడితే ఇప్పుడు అరెస్ట్ చేశారు: రోజా

- పోసాని అరెస్ట్ అక్రమమన్న రోజా
- తప్పులను ఎత్తి చూపితే చంద్రబాబు సహించలేకపోతున్నారని విమర్శ
- కూటమి నేతలకు వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరిక
సినీ నటుడు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయడం దారుణమని వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా అన్నారు. ఎప్పుడో ఆరేళ్ల క్రితం మాట్లాడితే... మనోభావాలు దెబ్బతిన్నాయని ఇప్పుడు అరెస్ట్ చేశారని మండిపడ్డారు. అన్యాయంగా బీఎన్ఎస్ 111 సెక్షన్ కింద కేసు పెట్టి అక్రమంగా ఇరికించారని విమర్శించారు. ప్రధాని మోదీ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ గతంలో చంద్రబాబు, బాలకృష్ణ, లోకేశ్ మాట్లాడలేదా? అని ప్రశ్నించారు. వాళ్లపై ఇదే సెక్షన్ కింద కేసు నమోదు చేయగలరా? అని సవాల్ విసిరారు.
వైసీపీ సానుభూతిపరులకు సాయం చేయవద్దని చంద్రబాబు చెప్పడం దారుణమని రోజా అన్నారు. వైసీపీ వాళ్లు కట్టే పన్నులను ప్రభుత్వం తీసుకోవడం లేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఎదురు మాట్లాడినా, ఆయన తప్పులను ఎత్తిచూపినా సహించలేకపోతున్నారని... వాళ్లపై అక్రమ కేసులు పెట్టి జైళ్లలో వేస్తున్నారని చెప్పారు.
అక్రమ కేసులతో రాష్ట్రాన్ని పాలిద్దామనుకుంటే... రేపు మళ్లీ అదే రిపీట్ అవుతుందని అన్నారు. జగన్ సీఎం అయిన తర్వాత కూటమి నేతలకు వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదని విమర్శించారు. మొన్నటి బడ్జెట్ తో ఇది మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వం అనే విషయం ప్రజలకు అర్థమయిందని అన్నారు.