Dubai: దుబాయ్‌లో సంబరాలు చేసుకున్నాడన్న రేవంత్ రెడ్డి విమర్శలపై స్పందించిన హరీశ్ రావు

Harish Rao fires at Revanth Reddy for his Dubai comments

  • ఎస్ఎల్‌బీసీ ప్రమాదం ఫిబ్రవరి 22న జరిగిందన్న హరీశ్ రావు
  • ఫిబ్రవరి 21న తాను దుబాయ్ వెళ్లానన్న హరీశ్ రావు
  • ఎస్ఎల్‌బీసీ పనులు బీఆర్ఎస్ హయాంలో ప్రారంభం కాలేదని నిరూపించాలని సవాల్

ఎస్ఎల్‌బీసీ సొరంగంలో ప్రమాదం జరిగిన రోజు తాను దుబాయ్‌లో సంబరాలు చేసుకున్నానని కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించారు.

ప్రమాదం జరిగిన రోజు హరీశ్ రావు దుబాయ్‌లో దావత్ చేసుకున్నారని, రెండు రోజుల తర్వాత తిరిగి వచ్చి రాజకీయం చేశాడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు కదా, మీరేమంటారని టీవీ9 మీడియా ప్రతినిధి ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి దివాలాకోరు రాజకీయానికి ఇది నిదర్శనమని  హరీశ్ రావు బదులిచ్చారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కూతురు పెళ్లి వేడుకకు తాను దుబాయ్‌కి ఈ నెల 21న వెళ్లానని, ఎస్ఎల్‌బీసీ ప్రమాదం ఈ నెల 22వ తేదీ ఉదయం జరిగిందని, మధ్యాహ్నానికి ఈ ప్రమాదం వెలుగు చూసిందని గుర్తు చేశారు.

సహచర ఎమ్మెల్యే ఇంట్లో వేడుకకు వెళ్లడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు స్పందించాల్సింది ప్రభుత్వమా? లేక ప్రతిపక్ష ఎమ్మెల్యేనా? అని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లుగా భావిస్తున్నాడని చురక అంటించారు. తన తప్పును దాచుకోవడానికి రేవంత్ రెడ్డి గొంతు పెంచి మాట్లాడతాడని అన్నారు. ప్రతిపక్షాల మీద బురద జల్లి ప్రతి అంశాన్ని పక్కదారి పట్టించాలని చూస్తున్నారని అన్నారు.

రేవంత్ రెడ్డికి సవాల్

ఎస్ఎల్‌బీసీ సొరంగం ప్రమాదం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యమే అని హరీశ్ రావు ఆరోపించారు. వారు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎస్ఎల్‌బీసీ పనులు జరగలేదని నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని సవాల్ చేశారు.

Dubai
Telangana
Revanth Reddy
Harish Rao
  • Loading...

More Telugu News