India: ఛాంపియన్స్ ట్రోఫీ: భారీ స్కోరు సాధించడంలో విఫలమైన భారత్

India settled for 249 runs against New Zealand
  • టోర్నీలో నేడు చివరి లీగ్ మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
  • 50 ఓవర్లలో 9 వికెట్లకు 249 పరుగులు చేసిన భారత్
  • కివీస్ పేసర్ మాట్ హెన్రీకి 5 వికెట్లు
  • రాణించిన శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా
ఛాంపియన్స్ ట్రోఫీలో ఇవాళ భారత్, న్యూజిలాండ్ జట్లు ఆడుతున్నాయి. టోర్నీలో ఇదే చివరి లీగ్ మ్యాచ్. గ్రూప్-ఏలో భాగంగా జరుగుతున్న ఈ పోరులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. దాంతో, మొదట బ్యాటింగ్ కు దిగిన టీమిండియా భారీ స్కోరు సాధించడంలో విఫలమైంది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 249 పరుగులు మాత్రమే చేసింది. శ్రేయాస్ అయ్యర్ అర్ధ సెంచరీ చేయగా... అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా ఆకట్టుకున్నారు. కివీస్ పేసర్ మాట్ హెన్రీ 5 వికెట్లతో రాణించాడు. 

భారత్ కు ఈ మ్యాచ్ లో శుభారంభం దక్కలేదు. కివీస్ పేసర్ల ధాటికి 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ (15), శుభ్ మన్ గిల్ (2), విరాట్ కోహ్లీ (11) పరుగులు చేశారు. ఈ దశలో శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ జోడీ ఆదుకుంది. అయ్యర్ 98 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 79 పరుగులు చేయగా... అక్షర్ పటేల్ 61 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ తో 42 పరుగులు చేశాడు. 

హార్దిక్ పాండ్యా (45), కేఎల్ రాహుల్ (23) కూడా ఫర్వాలేదనిపించడంతో టీమిండియా స్కోరు 200 మార్కు దాటింది. జడేజా 16 పరుగులు చేశాడు. దుబాయ్ స్టేడియంలో ఈ మ్యాచ్ కు స్లో పిచ్ ను ఉపయోగించడంతో పరుగులు చేసేందుకు బ్యాట్స్ మెన్ ఇబ్బంది పడ్డారు. మరి, టీమిండియా బౌలింగ్ దాడులను తట్టుకుని కివీస్ బ్యాట్స్ మెన్ ఎలా ఆడతారో చూడాలి.
India
New Zealand
Champions Trophy 2025
Dubai

More Telugu News