Viral Videos: ‘నీ రక్తం తాగుతా’ అంటూ కన్నతల్లిపై కూతురు దాడి

Woman Bites Beats Mother In Haryana

  • ఆస్తి కోసం జన్మనిచ్చిన తల్లిని చిత్రహింసలు పెట్టిన మహిళ
  • హర్యానాలోని హిస్సార్ లో ఘటన
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో

ఆస్తి పంచి ఇవ్వలేదనే కోపంతో ఓ మహిళ మృగంలా ప్రవర్తించింది. కన్నతల్లిని చిత్రహింసలు పెట్టింది. నీ రక్తం తాగుతానంటూ మీదపడి కొరికింది. మానవత్వానికే మచ్చలా మారిన ఈ ఘటన హర్యానాలోని హిస్సార్ లో చోటుచేసుకుంది. తల్లిపై తన చెల్లెలు చేసిన దాడిని ఆమె సోదరుడు సీసీటీవీ కెమెరా ద్వారా రికార్డు చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హిస్సార్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని మోడర్న్ సాకేత్ కాలనీకి చెందిన రీటాకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది.

కొంతకాలం తర్వాత భర్తతో గొడవ పడి పుట్టింటికి చేరింది. ఆపై సఖ్యత కుదరడంతో భర్తను, అత్తగారిని పుట్టింటికి పిలిపించుకుంది. తండ్రి చనిపోవడంతో ఒంటరిగా ఉంటున్న తల్లి నిర్మలాదేవి ఇంట్లోనే అందరూ ఉంటున్నారు. రీటా సోదరుడు అమర్ దీప్ సింగ్ ఉద్యోగరీత్యా వేరేచోట ఉంటున్నాడు. ఈ క్రమంలోనే తల్లి పేరుమీద ఉన్న ఆస్తిపై కన్నేసిన రీటా.. కురుక్షేత్రలో ఉన్న కుటుంబ ఆస్తిని రూ.65 లక్షలకు అమ్మించి ఆ డబ్బును తీసేసుకుంది. ఇంటిని, ఇతర ఆస్తిని కూడా తన పేరు మీద రాయాలంటూ తల్లిపై ఒత్తిడి తెచ్చింది.

అందుకు ఒప్పుకోలేదని తల్లిని ఇంట్లోనే బంధించి చిత్రహింసలు పెట్టింది. తనను ఇంటికి రాకుండా అడ్డుకునేదని, తనపై తప్పుడు కేసులు పెడతానని బెదిరించేదని అమర్ దీప్ ఆరోపించాడు. ఇటీవల రీటా తల్లిని చిత్రహింసలు పెడుతున్న వీడియోను సంపాదించి పోలీసులను ఆశ్రయించాడు. తల్లి నిర్మలాదేవిని రీటా తీవ్రంగా కొడుతూ మీదపడి కొరకడం ఈ వీడియోలో కనిపిస్తోంది. అమర్ దీప్ సింగ్ ఫిర్యాదు మేరకు రీటాపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Viral Videos
Mother Daughter
Beats Mother
Haryana

More Telugu News