DK Shivakumar: శివరాత్రి వేడుకల్లో సద్గురుతో డీకే.. సొంత పార్టీలో విమర్శలు

- సద్గురుతో కలిసి వేదిక పంచుకున్న డీకే శివకుమార్
- రాహుల్‌గాంధీ ఎవరో తెలియదన్న వ్యక్తిని ఎలా కలుస్తారన్న కర్ణాటక మంత్రి రాజన్న
- అందులో రహస్యం ఏమీ లేదన్న డీకే సోదరుడు సురేశ్
శివరాత్రి వేడుకల్లో సద్గురు జగ్గీ వాసుదేవ్‌తో వేదిక పంచుకున్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై సొంత పార్టీలోనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాహుల్‌గాంధీ గురించి తనకు తెలియదని సద్గురు గతంలో చెప్పడమే ఇందుకు కారణం. సద్గురు, డీకే కలయికపై హసన్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి, సహకారశాఖ మంత్రి రాజన్న మాట్లాడుతూ.. రాహుల్‌గాంధీ ఎవరో తనకు తెలియదన్న వ్యక్తిని డీకే కలవడం సరికాదని అన్నారు. రాహుల్ గాంధీ గురించి సద్గురు ఏం మాట్లాడారో తనకంటే డీకేకే ఎక్కువ తెలుసని అన్నారు. కాబట్టి సద్గురుతో వేదిక పంచుకోవడంపై శివకుమార్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ విమర్శలపై డీకే సోదరుడు సురేశ్ స్పందించారు. సద్గురు స్వయంగా వచ్చి ఆహ్వానించడంతోనే తమ కుటుంబం శివరాత్రి వేడుకలకు హాజరైనట్టు చెప్పారు. అయినా, శివకుమార్ రహస్యంగా ఎవరినీ కలవరని, ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యే ముందు కూడా అధిష్ఠానానికి సమాచారం ఇచ్చారని తెలిపారు. కోయంబత్తూరులో ఈషా కార్యక్రమానికి హాజరవుతున్నట్టు అధిష్ఠానానికి చెప్పారని వివరించారు. మరోవైపు, డీకే మాట్లాడుతూ.. తాను హిందువుగా పుట్టానని, హిందువుగానే మరణిస్తానని పేర్కొన్నారు. ఈషా వేడుకల్లో పాల్గొనడాన్ని సమర్థించుకున్నారు.