Bengaluru: భుజంపై చిలుకతో ద్విచక్ర వాహనం నడిపిన మహిళ... వీడియో వైరల్

- బెంగళూరులో కెమెరాకు చిక్కిన వీడియో
- 'ఎక్స్' వేదికగా పంచుకున్న నెటిజన్ రాహుల్ జాదవ్
- అందర్నీ ఆకట్టుకుంటున్న వీడియో
మహానగరం బెంగళూరులో ఓ మహిళ తన భుజంపై ఓ రామచిలుకను కూర్చోబెట్టుకొని ద్విచక్ర వాహనం నడుపుతున్న వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది. బెంగళూరులో ట్రాఫిక్ జామ్ అధికంగా ఉంటుంది. పలు ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది.
ఇటీవల ఒక మహిళ బెంగళూరు భారీ ట్రాఫిక్‌లో ల్యాప్‌ట్యాప్‌లో పని చేస్తూ కెమెరాకు చిక్కింది. మరో మహిళ కూరగాయలను తుంచుతూ వీడియోలో కనిపించింది. ఇలాంటి ఘటనలు బెంగళూరులో ఆసక్తికరంగా మారాయి. తాజాగా, ఓ మహిళ ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ తన భుజంపై రంగురంగుల చిలుకను పెట్టుకుంది. ఆమె హెల్మెట్ ధరించలేదు.
ఇందుకు సంబంధించిన వీడియోను రాహుల్ జాదవ్ అనే ట్విట్టరిటీ 'ఎక్స్' వేదికగా షేర్ చేశాడు. "బెంగళూరులో ఎప్పుడూ నిస్తేజమైన క్షణం అంటూ ఉండదు" అనే శీర్షికతో ఈ వీడియో షేర్ చేశాడు. ఇది అందర్నీ ఆకట్టుకుంటోంది. ఓ ఆటోలో నుండి ఈ వీడియోను తీసినట్లుగా కనిపిస్తోంది.