Nadendla Manohar: అలా మాట్లాడినందుకే ఒక వ్యక్తి జైల్లో లబోదిబోమంటున్నాడు: మంత్రి నాదెండ్ల

- మార్చి 14న పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ
- సభ నిర్వహణ కమిటీలతో నేడు పీఏసీ చైర్మన్ నాదెండ్ల సమావేశం
- పవన్ వంటి నేతలను తిడితే హీరోలు కాదు జీరోలు అవుతారని వెల్లడి
జనసేన పార్టీ ఆవిర్భావ సభ మార్చి 14న పిఠాపురంలో జరగనున్న నేపథ్యంలో, పార్టీ ఆవిర్భావ సభ నిర్వహణ కమిటీలతో జనసేన పీఏసీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ నేడు సమావేశమయ్యారు. కాకినాడలో జరిగిన ఈ సమావేశంలో నాదెండ్ల మాట్లాడుతూ, సభ నిర్వహణపై కమిటీలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో విజయం సాధించాక జరుగుతున్న తొలి ఆవిర్భావ సభ కావడంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పనిచేయాలని సూచించారు.
ఈ సందర్భంగా ఆయన, పవన్ ను దూషించిన వారి గురించి ప్రస్తావించారు. పవన్ వంటి నేతలను తిడితే హీరోలు కాదు జీరోలు అవుతారని స్పష్టం చేశారు.
"పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించడం అందరికీ ఫ్యాషన్ అయిపోయింది. ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఏ విధంగా మాట్లాడారో మనం చూశాం. నోరుందని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు. ఇలా మాట్లాడినందుకే ఒక వ్యక్తి జైల్లో కూర్చొని లబోదిబోమంటున్నాడు. ప్రభుత్వం మారినా కొందరు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు... వారిని వదిలిపెట్టం, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేసే వారిపై బురద జల్లాలని చూస్తే దిగజారిపోతారు. పార్టీ, నాయకుడిని కించపరిచేలా ఎవరూ మాట్లాడినా జనసైనికులు, వీర మహిళలు కచ్చితంగా ఖండించాలి. అయితే దానికి సరైన పద్ధతి ఎన్నుకోవాలి" అని నాదెండ్ల వివరించారు.