Chandrababu: సీఎం చంద్రబాబును కలిసిన అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి

- రాజధానిపై విస్తృత ప్రచారం కల్పించాలని చంద్రబాబు సూచన
- అమరావతి కోసం విరాళాలు సేకరించాలన్నది తన లక్ష్యమన్న వైష్ణవి
- యువతకు వైష్ణవి ఆదర్శంగా నిలుస్తుందన్న చంద్రబాబు
అమరావతి రాజధానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైన వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిశారు. వైష్ణవిని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తూ సీఆర్డీయే ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబును వైష్ణవి సచివాలయంలో శుక్రవారం కలిశారు.
అతిచిన్న వయసులోనే అంబాసిడర్‌గా నియమితులైన వైష్ణవిని సీఎం చంద్రబాబు అభినందించారు. రాష్ట్రాభివృద్ధిలో యువత పాలుపంచుకోవాలని, అలాంటి వారికి వైష్ణవి ఆదర్శంగా నిలుస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. అమరావతి కోసం విరాళాలు సేకరించాలన్నది తన లక్ష్యమని వైష్ణవి సీఎంకు వివరించారు. రాజధానిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలను, సంబంధిత అంశాలను ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సీఎం ఆమెకు సూచించారు.
కాగా, అంబుల వైష్ణవి గత ఏడాది జూన్‌లో రాజధానికి రూ.25 లక్షలు, 2019కి ముందు పలు దఫాలుగా రూ.25 లక్షలను విరాళంగా అందించారు.