Crime News: తనపై సామూహిక లైంగికదాడి జరిగిందని మహిళ ఫిర్యాదు.. దర్యాప్తులో ట్విస్ట్.. మహిళ అరెస్ట్

Ghaziabad woman false allegations leads to jail
  • ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఘటన
  • భర్త స్నేహితులు తనను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదు
  • దర్యాప్తులో విస్తుపోయే విషయాలు బయటకు
  • ఆమె ఆరోపణలన్నీ అవాస్తవాలని తేల్చిన పోలీసులు
  • గతంలోనూ ఇలాంటి ఫిర్యాదులు చేసినట్టు గుర్తింపు
  • అరెస్ట్ చేసి జైలుకు పంపిన పోలీసులు
తనపై సామూహిక లైంగికదాడి జరిగిందన్న మహిళ ఫిర్యాదుతో ఉరుకులు పరుగులు పెట్టిన పోలీసులు చివరికి అసలు విషయం తెలిసి నిర్ఘాంతపోయారు. ఫిర్యాదు ఇచ్చిన మహిళను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగిందీ ఘటన. 

ఇటీవల ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ తాను మార్కెట్‌కు వెళుతుండగా భర్త స్నేహితులు కిడ్నాప్ చేశారని, మత్తుమందు ఇచ్చి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారని ఆరోపించింది. మర్మాంగాల్లో బాటిల్ చొప్పించారని, శరీరంపై రసాయనాలు చల్లారని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు.

ఈ క్రమంలో సీసీటీవీలు, కాల్ రికార్డులు, లొకేషన్ వివరాలను పరిశీలించారు. దీంతో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె ఆరోపణలన్నీ అవాస్తవమని, ఆమెపై దాడి జరగలేదని తేల్చారు. అంతేకాదు, గతంలోనూ ఆమె తను సహజీవనం చేస్తున్న వ్యక్తిపై పలుమార్లు ఇలాంటి ఫిర్యాదులు చేసినట్టు గుర్తించారు. తప్పుడు ఫిర్యాదులు చేసినందుకు ఆమెను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు 

ఘజియాబాద్‌కు చెందిన నిందితురాలు కొన్నేళ్లుగా ఓ వ్యక్తితో సహజీవనం చేస్తోంది. గతేడాది పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. అతడు తనపై దాడి చేయడం వల్ల కడుపులో బిడ్డ చనిపోయిందని ఆరోపించింది. అయితే, కోర్టులో మాత్రం మాట మార్చింది. నెల రోజుల తర్వాత మళ్లీ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. తన వాంగ్మూలాన్ని మార్చుకోవాలని భయపెడుతున్నారంటూ భర్త సమీప బంధువుపైనా ఫిర్యాదు చేసింది.

ఈ ఏడాది జనవరిలో మరోమారు పోలీసులను ఆశ్రయించింది. పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని, కులం పేరుతో దూషించాడని, హింసించాడని ఆరోపించింది. దీంతో అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు జైలుకు పంపారు. ఈ విషయాలన్నీ దర్యాప్తులో బయటపడటంతో నిందితురాలిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
Crime News
Uttar Pradesh
Ghaziabad

More Telugu News