Jupally Krishna Rao: హరీశ్ రావుకు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నలు

- రాజకీయ దురుద్దేశంతో హరీశ్ రావు విమర్శలు చేస్తున్నారన్న జూపల్లి
- పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ఈ ప్రాజెక్టును ఎందుకు పెండింగులో పెట్టిందని ప్రశ్న
- ప్రకృతి విపత్తులను రాజకీయాలకు వాడుకుంటున్నారని విమర్శ
ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావుకు ప్రశ్నలు సంధించారు. ఈ ప్రమాదం వ్యవహారంలో రాజకీయ దురుద్దేశంతోనే హరీశ్ రావు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును పెండింగులో ఎందుకు పెట్టిందో చెప్పాలని ప్రశ్నించారు.
హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హరీశ్ రావును తాను సూటిగా ప్రశ్నిస్తున్నానని, ఈ సొరంగాన్ని 200 మీటర్లు తవ్వి మిగతా దానిని ఎందుకు వదిలేశారు? తక్కువ లాభం వస్తుందనే దీనిని మధ్యలో వదిలేశారా? ఈ సొరంగం నిర్మాణం పూర్తైతే కాంగ్రెస్‌కు పేరు వస్తుందనా? ఎందుకు రాజకీయాలు చేస్తున్నారని మూడు ప్రశ్నలు సంధించారు.
బీఆర్ఎస్ నేతలు ప్రకృతి విపత్తులను కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఎంతో తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టును ఎందుకు పెండింగులో పెట్టారని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్‌కు లేదని వ్యాఖ్యానించారు. అద్భుతం జరిగితే తప్ప సొరంగంలో చిక్కుకున్న 8 మంది బతికే అవకాశం లేదని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.