Nara Lokesh: మంగళగిరి శివరాత్రి వేడుకల్లో స్వామివారి రథాన్ని లాగిన నారా లోకేశ్

- భక్తులతో కలిసి స్వామి వారి రథాన్ని లాగిన నారా లోకేశ్
- గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో వేడుకలు
- 200 మీటర్ల మేర రథాన్ని లాగిన నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ మంగళగిరిలో జరిగిన శివరాత్రి వేడుకల్లో భక్తులతో కలిసి స్వామివారి రథాన్ని లాగారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో శివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శివరాత్రి వేడుకలను నిర్వహించారు.
ఇక్కడ జరిగిన రథోత్సవంలో మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న మంత్రికి నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. స్వామి వారి రథం వద్ద మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆ తర్వాత భక్తులతో కలిసి 200 మీటర్ల దూరం రథాన్ని లాగారు.
లోకేశ్ ట్వీట్
శివరాత్రి వేడుకల్లో భాగంగా మంగళగిరిలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన రథోత్సవంలో పాల్గొన్నానని లోకేశ్ 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు. భక్తుల శివనామ స్మరణ, అశేష జనసందోహం మధ్య రథాన్ని లాగానని పేర్కొన్నారు. దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయని తెలిపారు.
అనంతరం కృష్ణాయపాలెంలోని అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవంలో పాల్గొన్నానని తెలిపారు. విశ్వేశ్వరస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు. వేద పండితులు తనకు ఆశీర్వచనాలు అందించారని, స్థానికులతో కలిసి ఫోటోలు దిగానని పేర్కొన్నారు.

