Manchu Vishnu: 'కన్నప్ప' చేయనని చెబితే విష్ణు ఆ మాట అన్నాడు: అక్షయ్ కుమార్!

Kannappa Movie Update

  • ముందుగా 'కన్నప్ప'ను తిరస్కరించానన్న అక్షయ్ కుమార్
  • మంచు విష్ణు అలా అనడం వల్లనే ఓకే చెప్పానని వెల్లడి
  • ఇదొక అద్భుతమైన ప్రయాణమన్న మంచువిష్ణు 
  • ఏప్రిల్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల   
 
ముంబైలో జరిగిన ప్రత్యేక మీడియా ఈవెంట్‌లో ‘కన్నప్ప’ టీజర్‌ను ఆవిష్కరించారు. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ..  మంచు విష్ణు .. దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ఈ కార్యక్రమంలో సందడి చేశారు. సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీ వినయ్ మహేశ్వరి అధ్వర్యంలో ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రత్యేకంగా ప్రదర్శించిన ఈ 'కన్నప్ప' టీజర్ అందరినీ ఆకట్టుకుంది. అక్కడి మీడియా ప్రతినిధులు 'కన్నప్ప' టీజర్ మీద ప్రశంసలు కురిపించారు. 

ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో డా. మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రం విజువల్ వండర్‌గా ఆడియెన్స్ ముందుకు రాబోతోంది.  శివుడి పాత్రలో నటించిన అక్షయ్ కుమార్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘మొదటగా 'కన్నప్ప' ఆఫర్ నా వద్దకు వచ్చినప్పుడు రెండు సార్లు తిరస్కరించాను. కానీ భారతీయ సినిమా ప్రపంచంలో శివుడిగా నేను బాగుంటాను అని విష్ణు పెట్టుకున్న నమ్మకమే నన్ను ఈ సినిమా ఒప్పుకునేలా చేసింది. 'కన్నప్ప' కథ చాలా శక్తివంతమైంది. ఎంతో లోతైన ఎమోషన్స్ ఉంటాయి. విజువల్ వండర్‌గా ఉండబోతోంది. ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగం కావడాన్ని గౌరవంగా భావిస్తున్నాను’ అని అన్నారు.

 మంచు విష్ణు మాట్లాడుతూ.. ‘కన్నప్ప' కేవలం నాకు ఓ ప్రాజెక్ట్.. ఓ సినిమా కాదు.. ఇది నా జీవిత ప్రయాణం. నేను ప్రస్తుతం భారతదేశంలోని అన్ని జ్యోతిర్లింగాలను సందర్శిస్తున్నాను. 'కన్నప్ప' కథతో నాకు ఆధ్యాత్మిక బంధం ఏర్పడింది. ఇది అచంచలమైన విశ్వాసం, త్యాగానికి సంబంధించిన కథ. ఈ ప్రయాణంలో అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, ప్రభాస్ వంటి దిగ్గజాలు మాతో చేరడం నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే భక్తి, దైవిక శక్తితో నిండిన ఈ కథ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి వ్యక్తికి చేరుతుందని మేము నమ్ముతున్నాం. ఇది సరిహద్దులను దాటి మానవాళి హృదయంతో మాట్లాడే చిత్రం కానుంది’అని అన్నారు.

 దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. అక్షయ్, మోహన్‌లాల్, ప్రభాస్ వంటి దిగ్గజాలను డైరెక్ట్ చేయడం అద్భుతమైన అనుభవం. వారందరూ చాలా సహకరించారు. వారి పాత్రలు తెరపై అద్భుతం చేయబోతోన్నాయి. ఈ చిత్రం పట్ల విష్ణుకున్న ప్యాషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఉత్కంఠభరితమైన విజువల్స్ తో 'కన్నప్ప' అందరి ముందుకు రాబోతోంది. ఇప్పటికే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ దృష్టిని ఆకర్షించిన ఈ 'కన్నప్ప' టీజర్,  మార్చి 1న అందరి ముందుకు రాబోతోంది. ఈ చిత్రం ఏప్రిల్ 25, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది"అని అన్నారు. 

  • Loading...

More Telugu News