Vallabhaneni Vamsi: జైల్లో ఒంటరిగా ఉంచడంపై వల్లభనేని వంశీ కీలక వ్యాఖ్యలు

- ఆరోగ్య సమస్యలు ఉన్నందున జైల్లో తనతో పాటు మరొకరిని ఉంచాలని కోరిన వంశీ
- భద్రతాపరంగా తనకు ఎలాంటి ఇబ్బంది లేదని కోర్టుకు తెలిపిన వంశీ
- వంశీ ఆరోగ్య పరిశీలన కోసం వార్డెన్‌ను ఉంచడానికి అభ్యంతరం లేదన్న ప్రభుత్వం
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తనకు ఆస్తమా ఉందని, ఆరోగ్య సమస్య వస్తే ఇబ్బంది అవుతుందని, కాబట్టి జైల్లో సెల్లో తనతో పాటు మరొకరిని ఉంచాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. వంశీ మూడు రోజుల కస్టడీ ముగియడంతో పోలీసులు అతనిని విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు.
తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ, సెల్‌లో తనను ఒంటరిగా ఉంచారని కోర్టు దృష్టికి తెచ్చారు. భద్రతాపరంగా తనకు ఎలాంటి ఇబ్బంది లేదని వెల్లడించారు.
అయితే, జైల్లో వంశీకి దగ్గరలో అటెండర్ సౌకర్యం కల్పించారు కదా అని న్యాయమూర్తి అడిగారు. సెల్‌లో మరొకరిని ఉంచేందుకు ఇంఛార్జ్ జడ్జిగా తాను ఆదేశించలేనని న్యాయమూర్తి తెలిపారు.
అయితే, సెల్‌లో వంశీకి ఏమైనా జరిగితే అధికారులు బాధ్యత వహించాలని న్యాయమూర్తి వ్యాఖ్యానించినట్లుగా సమాచారం. సెల్ మార్పు కోసం రేపు రెగ్యులర్ కోర్టులో మెమో దాఖలు చేయాలని వంశీ తరఫు న్యాయవాదికి సూచించారు. సెల్ వద్ద వార్డెన్‌ను అందుబాటులో ఉంచాలని జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
వంశీ ఆరోగ్య పరిశీలన కోసం వార్డెన్‌ను ఉంచడానికి అభ్యంతరం లేదని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. అనంతరం వంశీని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.