Harish Rao: ఆంధ్రప్రదేశ్ కృష్ణా జలాలను తరలించుకుపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆపడం లేదు: హరీశ్ రావు

- బనకచర్ల ప్రాజెక్టును నిర్మిస్తుంటే రేవంత్ రెడ్డి మాట్లాడటం లేదని విమర్శ
- కృష్ణా జలాలపై బీఆర్ఎస్ ఫిర్యాదు తర్వాతే కేఆర్ఎంబీ వద్ద ఫిర్యాదు చేశారన్న హరీశ్ రావు
- ఎస్ఎల్‌బీసీ సొరంగంలోకి తమను అనుమతించలేదన్న హరీశ్ రావు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా జలాలను అక్రమంగా తరలించుకుపోతోందని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. మన నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోతుంటే అధికార కాంగ్రెస్ పార్టీ ఈ అన్యాయాన్ని అడ్డుకోవడం లేదని ఆయన విమర్శించారు. గోదావరిపై ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును నిర్మిస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించడం లేదని అన్నారు. కృష్ణా జలాలపై తాము నిలదీసిన తర్వాతే కేఆర్ఎంబీ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారని తెలిపారు.
ఎస్ఎల్‌బీసీ సొరంగంలోకి హరీశ్ రావు, ఇతర బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అనుమతించలేదు. ఈ నేపథ్యంలో వారు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఉన్న ప్రాజెక్టులను కాపాడలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఆయన అన్నారు.
ఎస్ఎల్‌బీసీ అంశంపై హరీశ్ రావు మాట్లాడుతూ, సొరంగంలోకి వెళ్లేందుకు తమకు అనుమతి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతో తాము ఇన్ని రోజులు ప్రమాదస్థలికి రాలేదని, కానీ ఆరు రోజులు గడిచినా సొరంగంలో చిక్కుకున్న బాధితులపై ఇప్పటికీ స్పష్టత రాలేదని ఆయన అన్నారు. సహాయక బృందాలను సమన్వయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.